కాంగ్రెస్తో పెట్టుకుంటే ఆ పార్టీ మునిగిపోవడం మాత్రమే కాదు..తమను కూడా ముంచేస్తుందని మిత్రపక్షాలకు క్లారిటీ వస్తోంది. మెల్లగా కాంగ్రెస్ తో సంబంధం లేదని
హింట్ ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా మైనర్ పార్టీ. అయినా జాతీయస్థాయిలో ప్రతిపక్షంగా ఆ పార్టీ బ్యాక్ గ్రౌండ్ ను చూసి .. బీజేపీని కలసికట్టుగా పోరాడటానికి ఓ వేదిక ఉండాలి కాబట్టి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నాయి. కలసి పోటీ చేసేందుకు సీట్లు కేటాయిస్తున్నాయి.కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్వాకాలతో మొదటికే మోసం వస్తూండటంతో దూరం జరిగితే బెటర్ అనుకుంటున్నాయి.
ఆప్, ఆర్జేడీని ముంచేశారు.. !
కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత, ఏ మాత్రం తెలివి లేని రాజకీయాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మునిగిపోయింది. కాంగ్రెస్ తో జత కట్టాలని ఆ పార్టీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ బీజేపీని ఎదుర్కోవడానికి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే హర్యానాఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పగానే.. ఇక మిత్రలెవరూ వద్దని .. ఆప్ కు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. ఫలితంగా ఒకటి, రెండు శాతం ఓట్లలోనే కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఇపుడు ఆర్జేడీని కూడా అలాగే ముంచేశారు. రెండు సార్లు కాంగ్రెస్ నేతల వ్యూహాత్మక తప్పిదాలకు ఆర్జేడీతో బలయింది. ఓటు చోరీ పేరుతో చేసిన నిర్వాకాలకు ప్రజలు డిటాచ్ అయిపోయారు. ఫలితంగా ఆర్జేడీతో మరోసారి ప్రతిపక్షంలో ఉండిపోయింది. ఆప్ ఎప్పుడో కాంగ్రెస్ ను వదిలించుకోగా.. ఆర్జేడీ ఇక పట్టించుకునే అవకాశాలు లేవు.
కాంగ్రెస్ తో కలసి పోటీపై ఆలోచన చేస్తున్న స్టాలిన్
కాంగ్రెస్ మిత్రపక్షాల్లో బలమైన పార్టీ డీఎంకే. బీహార్ ఎన్నికల తర్వాత మొదటి సారిగా స్పందించింది స్టాలినే. ఇండియా కూటమికి ఈ ఫలితాలు గుణపాఠం అని ఆయన నర్మగర్భంగా చెప్పారు. నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. అంటే ఆయన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీతో ఉంటే తమ పుట్టి ముంచేస్తారనే. కాంగ్రెస్ కూడా అలాంటి రాజకీయాలే చేస్తోంది. విజయ్ తో కలిసి వెళ్తామని డీఎంకేను బెదిరిస్తోంది. అందుకే స్టాలిన్ కాంగ్రెస్ ను వదిలేసేందుకు రెడీ అవుతున్నారని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. యూపీలో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులతో అఖిలేష్ యాదవ్ మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పెట్టుకోవడం దండుగని అనుకుంటున్నారు. ఇక బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నీడను కూడా అంగీకరించే అవకాశం ఉండదు. నెక్ట్స్ బీజేపీ టార్గెట్ ఆ పార్టీనే.
భస్మాసుర నాయకత్వమే కాంగ్రెస్ కు మైనస్
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. తమ నెత్తి మీద చేయి పెట్టుకున్నట్లుగా ఉంటున్నాయి. గెలవడానికి కాకుండా.. మిత్రపక్షాలను ఓడించడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలపై పోరాడమంటే.. వ్యవస్థలపై పోరాడుతున్నారు. ఆ నిందను మిత్రపక్షాలపైకి తీసుకు వస్తున్నారు. ఫలితంగా వారికీ నష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెరుగుపడేవరకూ ఆ పార్టీని దూరంగా ఉంచడం మంచిదని మిత్రపక్షాలన్నీ ఓ అభిప్రాయానికి స్తున్నాయి. మరో రెండు , మూడు నెలల్లో కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంది.

