ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడటం అంటే ఇదేనేమో. ప్రత్యర్థిని ఓడించడానికి వేసిన ఉచ్చులో తామై చిక్కుకున్నది టీమ్ ఇండియా. ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 93 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ మెడ నొప్పి కారణంగా మైదానాన్ని వీడిన శుభ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజుకి రాలేదు. ఇది సఫారీ జట్టుకు కలిసొచ్చింది.
నిజానికి భారత్ గెలవాల్సిన మ్యాచ్ ఇది. స్పిన్ ప్రభావం ఏ రేంజ్ లో వున్నా.. 124 పరుగులని చేధించగలదనే నమ్మక అందరిలోనూ వుంది. కాకపోతే స్పిన్ ఉచ్చు రివర్స్ అయ్యింది. భారత్ కోరుకున్నట్టుగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను రూపొందించారు. సౌతాఫ్రికా జట్టుకి స్పిన్ బలహీనత వుంది. ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకొని స్పిన్‌కు అనుకూలించేలా పిచ్ సిద్ధం చేశారు. అందుకే కుల్దీప్, జడేజా, సుందర్, అక్షర్.. ఇలానలుగురు స్పిన్నర్లతో దిగారు.
తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు తీయడంతో పిచ్ పేస్-స్పిన్ రెండింటికీ సమతూకంగా ఉందనుకున్నారు. అయితే రెండో రోజు నుంచి పిచ్ అసలు స్వరూపం బయటపడింది. బ్యాటర్లు బంతిని ఎదుర్కోవడానికే భయపడేలా ప్రవర్తించింది. స్పిన్ భీకరంగా తిరిగింది. 124 పరుగుల చిన్న లక్ష్యమే కొండలా కనిపించింది. 93 పరుగులకే భారత బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడిపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లను పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్ హర్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం పిచ్‌పై టీమ్ ఇండియా మాజీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటి పిచ్‌లతో టెస్టు క్రికెట్‌ను మనమే చంపేస్తున్నాం” అంటూ హర్భజన్ సింగ్ ఫైరయ్యాడు. అయితే సౌరభ్ గంగూలీ మాత్రం క్యురేటర్ కి మద్దతు తెలిపాడు. “టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కోరిక మేరకే పిచ్ రూపొందించబడింది” అన్నారు.
ఆతిథ్య జట్టుకు తమ బలం, బలహీనతలకు తగ్గట్టుగా పిచ్ రూపొందించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ పిచ్ కనీసం ఆడగలిగేలా వుంది. క్రికెట్ మరీ ఇలా గ్యాంబ్లింగ్‌లా మారకూడదు. పైగా తమ ఉచ్చులో తామే చిక్కుకోవడం మరింత అప్రతిష్ట.
