పోయింది.. టీమ్ ఇండియా పరువు పోయింది. సొంత గడ్డపై పులులు అనే బ్రాండ్ తుడిచిపెట్టుకుపోయింది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘోర ఓటమి మూటగట్టుకొంది. తొలి మ్యాచ్లోనూ భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలా.. రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో వైట్ వాష్ చేయించుకొని పరాభవం పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆఖరి రోజున కేవలం 140 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. జడేజా (54) మినహా ప్రతి బ్యాటర్… సౌత్ ఆఫ్రియా బౌలింగ్ ని ఎదుర్కోలేక చతికిలపడడంతోచ భారత్కు పరాభవం తప్పలేదు. సుదర్శన్ (14), ధృవ్ (2), పంత్ (13), నితిష్ కుమార్ (0), వాషింగ్టన్ సుందర్ (16) నిరాశ పరిచారు.
సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సైమన్ 6 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులు చేసిన భారత్.. ఏ ఇన్నింగ్స్ లోనూ పట్టుమని 90 ఓవర్లు ఆడలేకపోయింది. బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదని, పిచ్ తారు రోడ్డులా ఉందని కామెంట్ చేసిన మన బౌలర్లు… ప్రత్యర్థి బౌలింగ్ ను ఎదుర్కోలేక బ్యాట్లు ఎత్తేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బుమ్రా మ్యాజిక్ పని చేయలేదు. జడేజా బంతి స్పిన్ తిరగలేదు. కులదీప్ ప్రభావం చూపించలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ అయితే.. పార్ట్ టైమ్ బౌలర్ కన్నా ఘోరంగా తయారైంది. సొంత గడ్డపై చెలరేగిపోయే మన స్పిన్నర్లు ఈ రెండు టెస్టుల్లోనూ ఏమాత్రం రాణించలేకపోవడం, అదే సమయంలో ప్రత్యర్థి బౌలర్లు విరుచుకుపడడం విస్మయానికి గురి చేస్తోంది. వరుస ఓటములతో టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసు నుంచి భారత్ తప్పుకొన్నట్టే.