టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ కథ ముగిసింది. మరో లీగ్ మ్యాచ్ ఉండగానే టోర్నీ నుంచి వెనక్కి వచ్చేసింది. గ్రూప్ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది. ఆప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్త టెన్షన్ పడినా సులువుగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ సంచలనం సృష్టిస్తే ఇండియాకు సెమీస్ చాన్సులు ఉండేవి. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై ఘోరంగా ఓడిపోయినప్పటికీ పసికూనలపై మాత్రం భారీ విజయాలు సాధించి .. మంచి రన్ రేట్‌ను ఇండియా టీం రెడీ చేసుకుంది. అయితే న్యూజిలాండ్ ఖచ్చితంగా ఓ మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంది. కానీ అలాంటి చాన్స్ రాలేదు. పసికూనలు సంచలనాలు నమోదు చేయలేదు
టీమిండియా బరిలో లేకుండా న్యూజిలాండ్ – ఆప్ఘన్ మ్యాచ్ సెమీస్‌లా మారింది. తాను ఆడని మ్యాచ్‌లో ఫలితం తనకు అనుకూలంగా రావాలని భారత అభిమానులు కూడా చకోరపక్షుల్లా ఎదురు చూశారు. ఆప్ఘనిస్థాన్ బ్యాటింగ్‌లోనే విఫలమయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేయగిలిగింది. అయితే బౌలింగ్‌లో ఆప్ఘన్ కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. వికెట్లు తీయకపోయినా పరుగులు కట్టడి చేసింది. అయితే వికెట్లు కాపాడుకున్న ఆటగాళ్లు చివరికి సింపుల్‌గా విజయం సాధించి పెట్టారు.
ఇదే గ్రూపులో ఉన్న పాకిస్థాన్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం భారత్-నమీబియా మ్యాచ్ నామమాత్రం కానుంది. ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. టీమిండియాకు ఒరిగేదేమీ లేదు.