ఎడిటర్స్ కామెంట్ : ది నేమ్ ఛేంజర్స్ !

” నరేంద్రమోదీ ప్రధాని అయితే ఇండియాను అమెరికా చేసేస్తారు. రూపాయల కోసం డాలర్లు కుప్పలు కుప్పలుగా తెచ్చి ఇండియాలో పడేస్తారు. ఉద్యోగాల కోసం ఇండియన్స్ అమెరికా వెళ్లడం కాదు.. అమెరికన్లే ఇండియాకు వస్తారు ” అని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వాట్సాప్ యూనివర్శిటీ అదరగొట్టింది. సోషల్ మీడియా మేనేజ్ మెంట్లో పండిపోయిన ఆ పార్టీ తెచ్చిన హైప్ చూసి.. నిజంగానే గుజరాత్ లో మోదీ ఎవరూ చేయనంత అభివృద్ధి చేశారని ఆయన కానీ ప్రధానమంత్రి అయితే ఇండియాను అమెరికా చేసేస్తారని అనుకున్నారు. ఓట్లు గుద్దేశారు. తిరుగులేని మెజార్టీతో ఆయన ప్రధాని అయ్యారు. తర్వాత అదే దేశ్ భక్తి నినాదంతో .. మరో సారి దున్నేశారు. ఇప్పుడు మూడో సారి గెలిచేందుకు మోదీ తహతహలాడిపోతున్నారు. కానీ ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా ఆయన ఇండియాను అమెరికా చేయలేదు. చేసే ఉద్దేశంలో కూడా లేరు. కానీ ఇండియాను సమూలంగా మర్చాలనకుంటున్నారు. ఎలా అంటే.. భారత్ లాగా. ఇండియా ను భారత్ అని మార్చబోతున్నారు. అదేంటి .. ఇండియా .. భారత్ ఒక్కటి కాదా అనే డౌట్ ఎవరికైనా వస్తే.. మనసులో అణిచి వేసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఒక్కటే. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇండియా అనేది శత్రుపదం అయిపోయింది.. ఇప్పుడు భారత్ ఒక్కటే.. మన దేశానికి పేరు. అందుకే.. చట్టం చేసైనా ఇక ముందు భారత్ ఒక్కటే మన దేశానికి పేరు ఉంచాలని డిసైడయ్యారు. ఇప్పటికే రాజ్యాంగంలో భారత్ అనే పదం ఉందని.. ప్రెసిడెంట్ ఆఫ్ బారత్.. ప్రైమ్ మినిస్టర్ భారత్ అని అధికారిక పత్రాల్లో రాస్తున్నారు. ఇప్పుడు ఎవరు కాదన్నారు. భారత్ అన్నా ప్రపంచం మొత్తం ఇండియానే అని అనుకుంటుంది. ఇండియా అన్నా ఇండియానే అనుకుంటారు. ఇప్పుడెందుకు ఈ రచ్చ..? ఇండియా అనే పదాన్ని దేశానికి ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు ?. అదే రాజకీయం.

పాలన చేతకాక పేర్లు మార్చుకుంటున్న విశ్వ గురువులు

ఏమీ చేయలేనోడికి పాలన చేయమని పగ్గాలిస్తే.. చేతుల్లో పనే కదా అని పేర్లు మార్చుకుంటూ పోతున్నట్లుగా ఉంది వ్యవహారం. నిన్నమొన్నటిదాకా దేశంలో ఎన్ని సిటీల పేర్లను బీజేపీ పాలకులు మార్చాలో లేక్కే లేదు. యూపీలో అలహాబాద్ అనే పట్టణం ఉండేది.. ఇప్పుడు ఆది లేదు.. ఎదుకంటే పేరు మార్చేశారు.దానికి ప్రయాగరాజ్ అంటున్నారు. ఢిల్లీ సిటీలోని ఔరంగ్‌జేబ్ రోడ్డు పేరు డాక్టర్ అబ్దుల్ కలామ్ రోడ్డుగా మారింది. ఫిరోష్ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్ జైట్లీ స్టేడియం, రాజ్‌పథ్ పేరు కర్తవ్యపథ్, రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరు అమృత్ ఉద్యాన్, ఢిల్లీ యూనివర్శిటీలోని మొఘల్ గార్డెన్ పేరు గౌతమ్‌బుద్ధ సెంటెనరీ గార్డెన్‌గా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫైజాబాద్ పేరు అయోధ్యగా, అలహాబాద్ పేరు ప్రయాగ్‌రాజ్‌గా, ముఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్పుచెందాయి. ఇదే వరుసలో ఇకపైన ఆగ్రాను ఆగ్రావన్‌గా, ముజఫర్‌నగర్‌ను లక్ష్మీనగర్‌గా, ఫిరోజాబాద్ జిల్లా పేరును చంద్రానగర్‌గా, ఆజామ్‌గఢ్ పేరును ఆర్యన్‌గఢ్‌గా మార్చే ప్రతిపాదనలూ ఉన్నాయి. ఇప్పటికీ యూపీలో ఇంకా పేర్లు మార్చాల్సిన నగరాలు, పట్టణాలు చాలానే ఉన్నాయి. వరుసగా మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా 40 నగరాల పేర్లు మార్చేసారు. ఢిల్లీలో రాజ్ పథ్ గా పిలిచే రోడ్ ను కర్తవ్యపథ్ గా మార్చారు. ఇంకొన్ని రోడ్ల పేర్లు మార్చారు. ఈ పేర్ల మార్పిడి పిచ్చి ఎలా దేశం మొత్తం పాకించాలంటే.. ఎక్కడకు వెళ్లినా .. బీజేపీ నేతలు అక్కడి ప్రజలకు తాము నగరాల పేర్లు మార్చేస్తూంటామని హామీ ఇస్తూంటారు. తెలంగాణకు వస్తే .. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తామంటారు. కరీంనగర్ కు పోతే.. అక్కడ ఇంకో పేరు పెడతామంటారు. మొత్తంగా ఇవన్నీ ఎందుకు అంటే.. ఆయా నగరాలకు ముస్లింల పేర్లు ఉన్నాయనేది బీజేపీ నేతల వాదన. ఉండకూడదా.. ఇంతా కాలం ఉన్నాయి కదా.. అంటే.. ఎవరికీ సమాధానం రాదు. ఉండకూడదు అంతే. సరే అధికారం ఉంది ఏమైనా చేస్తారనుకుందాం.. మరి ఇండియా అంటే..ఎందుకు కోపం. అదేమి ముస్లిం పేరు కాదు కదా !. ప్రపంచం మొత్తం వాడుకలో ఇండియా అనే ఉంది. దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నా.. పేరు అయితే స్థిరపడిపోయింది. అలాగే.. భారత్ అని కూడా పిస్తున్నాం. రాజ్యాంగంలో కూడా భారత్ అని ఉంది. భారత్ నే ప్రపంచం వ్యాప్తంగా పాపులర్ చేయాలనుకుంటే దానికి నిర్దిష్టమైన కారణం ఉండాలి. ఇక్కడ ఆ కారణం ఉంది… అదేమిటంటే.. ఇప్పటి వరకూ యూపీఏ అని.. మరొకటి అని పేర్లను పెట్టుకున్న ప్రతిపక్షాల కూటమి.. తమ కొత్త కూటమికి I.N.D.I.A అని పెట్టుకుంది. ఇండియా కూటమిగా ప్రచారంలోకి రావడం బీజేపీ అగ్రనేతలకు అసలు ఇష్టం లేకపోయింది. అందుకే ఇండియాను శత్రువుగా ప్రకటించేసుకుంది. విపక్షాల కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడంతోనే వచ్చిన తిప్పలుఇవన్నమాట.

ఇప్పటి వరకూ మన దేశం ఇండియా – ఇప్పుడెందుకు దానిపై శత్రుత్వం ?

ఇండియా కూటమికి ఓటేయకపోతే ప్రజలు తాము ఇండియాకు వ్యతిరేకంగా ఓటేస్తున్నామన్న భావనకు వస్తారని బీజేపీ పెద్దలు భయపడ్డారు. నిజానికి ఇలా జరుగుతుందా అంటే.. చాన్సే ఉండదు. కానీ దేశ భక్తి రాజకీయాలతో దేశం కోసం ధర్మం కోసం అని ప్రతి అడ్డమైన పనిని సమర్థించుకునేవారికి.. ఆ ఎమోషన్ తో ఓట్ల రాజకీయం చేసిన వారికి.. తమ చేతి నుంచి ఆ భావోద్వేగ ఓట్ల దండం నుంచి లాగేసుకుంటారన్న భయం పట్టుకుంది. అందుకే ఇండియా మీద దండయాత్ర ప్రారంభించేశారు. జి 20 సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఇతర దేశాల నాయకులకు ఏర్పాటు చేసిన విందు ఆహ్వానాల్లో ‘‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’’ అని ఉండాల్సిన చోట ‘‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’’ అని రాసేశారు. ప్రతిపక్ష కూటమి ‘‘ఇండియా’’ మోదీ ప్రభుత్వాన్ని ఎంతగా కలవరపరుస్తోందో దీనివల్ల అర్థం అవుతోంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ మన దేశాన్ని ఇక మీదట ఇండియా అనకూడదని, భారత్‌ అనాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పేరు వాడాలని సెలవించ్చారు. రాతలోనూ, మాటలోనూ భారత్‌ అనే అనాలని చెప్పారు. దాన్నే పాటిస్తున్నారు. నిజానికి రాజ్యాంగంలో కూడా ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుందని ఉంది. రాజ్యాంగ నిర్మాతలు భారత్‌ అన్న పేరు విస్మరించలేదు. ఇంగ్లీషులో వ్యవహరించేటప్పుడు ఇండియా అని, హిందీలో ప్రస్తావించేటప్పుడు భారత్‌ అని వాడడం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇండియా బదులు భారత్‌ అన్న పేరు అధికారికంగా వాడడం రాష్ట్రపతి పంపిన ఆహ్వానంతోనే ప్రారంభం కాలేదు. ప్రధాన మంత్రి మోదీ గత నెలలో గ్రీస్‌ పర్యటనకు వెళ్లినప్పుడే మొదలైంది. అధికార మర్యాదలకు సంబంధించిన వ్యవహారాల్లో ‘‘ప్రైం మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’’ అనే వాడారు. ఇంతకు ముందు ఇంగ్లీషులో ‘ప్రైం మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా’’ అనే వారు. ఇండియా అంటే ప్రతిపక్ష కూటమి అనుకుంటారేమోనన్న భయం మోదీ సర్కారును పీడిస్తోంది. గ్రీసు పర్యటన సందర్భంగా సమాచార సామాగ్రి తయారు చేసే వారికి ఇండియా బదులు భారత్‌ అని వాడాలని ఆదేశించారు. కారణం ఏదైనా ఇండియా అనే పేరును ఇప్పుడు బీజేపీ .. సంబధిత వర్గాలు శత్రువుగా ప్రకటించుకున్నాయి. వాడకూడదని అప్రకటిత నిషేధం విధించుకున్నాయి. దేశాన్ని భారత్ అనే పిలవాలని అంటున్నాయి.

భారత్ కూడా మన దేశం పేరే – ఎవరు కాదన్నారు ?

విపక్షాల కూటమి ఇండియా అనే పేరు పెట్టుకుందని ఇండియా పేరును మార్చేస్తే దేశానికి ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కరెన్సీ దగ్గర నుంచి ప్రతీ దాంట్లోనే ఇండియా అనే పేరు ముద్రపడిపోయింది. అన్నింటిన మార్చడం సాధ్యం కాదు. వాటిని మార్చడం కన్నా.. ప్రతిపక్ష కూటమి ఇండియా అనే పేరును వాడకుండా నిషేధం విధిస్తూ..చట్టం చేయడం మంచిది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనా ప్రజలు నోర్మూసుకుని ఉంటారు. ఎందుకంటే.. పాలకుల అహానికి తాము ఎందుకు బలి కావాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఈ రాజకీయాలను భరించే తీరిక లేదు. దేశంలో అత్యధిక మంది ఒక్క రోజు పని చేసుకోకకపోతే.. ఆకలి తీరదేమో అని ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పథకాల పేర్లు మారాయి. నగరాల పేర్లూ మారాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పలు వీధుల పేర్లూ మారాయి. కానీ ప్రజల బతుకుల్లో ఏమైనా మార్పు వచ్చిందా ?. ఒక ఎజెండా ప్రకారం పేర్లు మార్చుకునే ప్రక్రియ తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉన్నది. పేర్లు మారినంత మాత్రాన చరిత్ర మాసిపోదు. పథకాల పేర్లు మార్చినంతమాత్రాన లబ్ధిదారుల జీవితాల్లోనూ మార్పు రాదు. మౌలికమైన అవసరాలను తీర్చకుండా, పాలనా విధానంలో మార్పు రాకుండా ఎన్ని పేర్లు మార్చినా ప్రయోజనం ఉండదు. ఒకవైపు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిందని గొప్పగా చెప్పుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ఉత్సవాలు చేసుకుంటున్నాం. అదే సమయంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వర్గాల సంక్షేమం, పేదరిక నిర్మూలనా పథకాలను కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల ఆదాయంలో సింహభాగం విద్య, వైద్యానికే ఖర్చవుతున్నదని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నదని లేబర్ సర్వే చెప్తున్నది. కనీస వైద్యం అందక పేదలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇన్ని సమస్యలు తాండవిస్తూ ఉంటే వాటికి శాశ్వత పరిష్కారం చూపలేని ప్రభుత్వాలు హిందు, ముస్లిం, బానిసత్వ చిహ్నాల సాకుతో పేర్లను మార్చడంతో వచ్చే ప్రయోజనమేమీ లేదు. పాలకులు వారి ఎజెండా కోసం, తమదైన ముద్ర కోసం పేర్లు మార్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లాంటి చట్టాలకూ భారతీయ అనే పదం వచ్చి చేరుతున్నది. ప్రజల బతుకులను మార్చలేని ఈ పేర్ల మార్పుతో ప్రయోజనం శూన్యం. ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నికైనవారు, దేశాన్ని పాలించే నేతలు, ప్రజల ఓట్లతో అధికార పీఠాన్ని ఎక్కిన ప్రజలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడనంతకాలం, వారి బతుకుల్లో మార్పు లేనంతకాలం దేశం మొదలు గల్లీ వరకు ఎన్ని పేర్లు మార్చినా, ఏ పేరు పెట్టినా ఒరిగేదేమీ ఉండదు. ఎన్నికల సమయంలో ఎమోషన్స్ కోసం చేసే ఇలాంటి ప్రయోగాల వెనక రాజకీయ ప్రయోజనం ఉండదు. కానీ మన రాజకీయ నేతలకు కావాల్సింది.. దేశం అభివృద్ధి.. ప్రజల బతుకులు బాగుపడటం కాదు. రాజకీయంగా విజయం సాధించడమే. అందు కోసం భావోద్వేగాల ఆట ఆడుతున్నరు.

పేరు మారిస్తే పేదరికం పోతుందా ? భారత్ ను అభివృద్ధి చేయలేకపోవడానికి పేరే అడ్డం అయిందా ?

ఇండియా అనే పేరు ఉండటం వల్లనే మనం ఇప్పటి వరకూ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండలేదు. చంద్రయాన్, మంగళ్‌యాన్, గగన్‌యాన్ లాంటి శాస్త్రీయ ప్రయోగాలతో దేశానికి అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్న ఖ్యాతి కూడా దక్కింది. ఇండియా, భారత్ అనే పేర్లతో సంబంధం లేదు. ఇప్పుడు ఇండియా అనే పదాన్ని తీసేసి భారత్ అని తగిలించినంతమాత్రాన అదనంగా వచ్చేదేమీ లేదు. పేరు మార్పుతో పేదల బతుకులు బాగుపడతాయనుకుంటే, దేశం అభివృద్ధి చెందుతుందంటే స్వాగతించాల్సిందే. కానీ ఈ పేరు మార్పు ఎలా ప్రజలకు మేలు చేస్తుందో చెప్పే ధైర్యం పాలకులు ఉందా అన్నదే సందేహం. లేనే లేదని అర్థమవుతుంది. ఎందుకంటే వారిది దురుద్దేశమే. ఇప్పటి వరకూ సొంత ప్రజల్లో చీలిక తీసుకు వచ్చి మెజార్టీ వాదంతో తిరుగులేని విజయాలు సాధించాలన్న ప్లాన్ వేశారు. ఈ క్రమంలో వారు అన్నీ మర్చిపోతున్నారు. చివరికి దేశంపైనా దాడి చేస్తున్నారు.

నేమ్ ఛేంజర్స్ వద్దు గేమ్ ఛేంజర్స్ ను ఎన్నుకోండి ఓటర్స్ !

ఇప్పుడు దేశానికి కావాల్సిందే నేమ్ చేంజర్స్ కాదు..గేమ్ ఛేంజర్స్. ప్రపంచం మొత్తం ఓ కొత్త సాంకేతిక యుగంలోకి వెళ్తున్న సమయంలో అంది వస్తున్న అవకాశాల్ని .. అందుకుని ప్రపంచంలో మేటిగా వెలుగొందాలి. ప్రజల జవన ప్రమణాల్ని పెంచాలి.. అలాంటి ఆలోచనలు చేసే గేమ్ ఛేంజర్స్ కావాలి. అంతే కానీ.. పేర్లు మార్చుకుని రాజకీయం చేసే నేమ్ చేంజర్స్ అవసరం లేదు. ఈ విషయాన్ని ముందుగా గుర్తించాల్సింది ప్రజలు. వారు తమ ఓటుకు ఎంత బలం ఉందో గుర్తించాలి. ఓటు అనేది కుల, మతాలు, భావోద్వేగాలకు అతీతంగా ఉపయోగించాల్సిన అద్భుత ఆయుథంగా గుర్తించాలి. నాకు ఏమి వస్తుందని కాకుండా.. దేశానికి ఎంత మేలు..భవిష్యత్ తరాలకు ఎంత మేలు అని ఆలోచించి ఓటును వజ్రాయుధంగా వాడాలి. అప్పుడే ఈ పరిస్థితి మారుతుంది. లేకపోతే మనం ఎప్పటికీ పేర్లు మార్చుకుని రాజకీయాలు చేసుకుంటూ ఆకలితో అలమటిస్తూనే ఉంటాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close