నవాజ్ షరీఫ్ కూడా కొంచెం చొరవ చూపి ఉంటే…

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి పట్ల భారత ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. కానీ సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపధ్యంలో ఈనెల 15వ తేదీన ఇస్లామాబాద్ లో జరుగవలసిన విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీని గురించి మీడియా ప్రతినిధులు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశ్నించినపుడు “ముందు పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తి కానివ్వండి. తరువాత తగిన నిర్ణయాలు తీసుకొంటాము,” అని క్లుప్తంగా జవాబు చెప్పారు.

ఇంతకు ముందు లాహోర్ పర్యటన తరువాత మోడీ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు, ముఖ్యంగా విదేశాంగ శాఖ ప్రతినిధులు భారత్-పాక్ సంబంధాలు బలోపేతం చేయడం గురించి చాలా మాట్లాడేరు. కానీ ఇప్పుడు ఎవరూ కూడా త్వరలో జరుగవలసిన విదేశాంగ కార్యదర్శుల సమావేశం గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. అరుణ్ జైట్లీ మాటలలో ఆ అయిష్టత చాలా స్పష్టంగా కనబడుతోంది.

భారత్-పాక్ దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన ప్రతీసారి ఇటువంటి సంఘటన ఏదో ఒకటి జరగడం, పరిస్థితులు మళ్ళీ మొదటికి రావడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇదివరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాకిస్తాన్ కి స్నేహ హస్తం అందించినపుడు దానిని పాక్ అందుకోకుండా కార్గిల్ యుద్దానికి దిగి భారత్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకొంది. మళ్ళీ ఇప్పుడు మోడీ స్నేహ హస్తం అందించినపుడు కూడా ఆ నమ్మకం వమ్ము అయ్యేలా పఠాన్ కోట్ పై దాడి జరిగింది.

పారిస్ నగరంలో దాడి జరిగిన తరువాత ఫ్రాన్స్ ఎంత తీవ్రంగా స్పందించిందో అందరూ చూసారు. అలాగే ఒక రష్యా విమానాన్ని కూల్చినందుకు ఆ దేశం ఎంత తీవ్రంగా స్పందిస్తోందో అందరూ చూస్తున్నారు. ఇక అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అదెప్పుడూ ఏదో ఒక యుద్దంలో నిమగ్నమయ్యే ఉంటుంది. ఈ నేపధ్యంలో పఠాన్ కోట్ పై జరిగిన దాడిని చూసినట్లయితే అది భారత సార్వభౌమత్వవానికి ఉగ్రవాదులు విసిరిన ఒక సవాలు వంటిదని చెప్పవచ్చును. ఆ సవాలును భారత్ పట్టించుకోకుండా ఉంటుందని ఆశించడం చాలా అవివేకం.

ఆ సంగతి పాక్ కూడా గ్రహించింది కనుకనే దానిని వెంటనే ఖండించింది. కానీ ఇటువంటి సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ప్రధాని మోడీలాగే కొంచెం చొరవ తీసుకొని తగువిధంగా స్పందించి ఉంటే భారత్ వైఖరి కరుకుగా మారేది కాదేమో? కానీ పాక్ ప్రధానికి అటువంటి స్వేచ్చ లేకపోయినందునే చొరవ తీసుకోలేకపోతున్నారని భావించవలసి ఉంటుంది. అయినా కూడా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పరిదిలోనయినా ఎంతో కొంత చొరవ చూపి మోడీతో నేరుగా మాట్లాడి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో? కానీ పాక్ ఐ.ఎస్.ఐ., సైనికాధికారులు, మత చాందసవాదులు అందరూ కలిసి ఆయన నోటికి తాళం వేసినట్లున్నారు. ఒకవేళ భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం రద్దయినట్లయితే, అందుకు వారినే నిందించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com