“భారతీయ సూడో సెక్యూలరిజం అనేది హిందూ మతాన్ని మాత్రమే ‘కమ్యూనల్’ అని ముద్రవేసి, మిగతా మతాలకు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చే వక్రమైన రాజకీయ ఆట.”
ఈ మాట చెప్పింది ఇండియన్ కాదు. భారత రాజకీయాలను సమగ్రంగా అవగాహన చేసుకున్న తర్వాత కోయెన్రాద్ ఎల్స్ట్ అనే బెల్జియన్ రచయిత చెప్పిన మాట. ఇందులో వంద శాతం నిజం ఉంది. హిందువుల్ని చాలా సులువుగా ఇతర మతాల్లోకి మార్చేస్తున్నారు. అదే హిందువులు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించినా, పండుగలు జరుపుకున్నా.. తమ ఆచార వ్యవహారాలను పాటించినా వారు మతోన్మాదులు అవుతున్నారు. హిందూమతంపై చర్చలు పెడుతున్నారు. కానీ మరే ఇతర మతంపైనా ఇలాంటి చర్చలు జరగవు. రాజకీయ పార్టీలు హిందూ మత సంప్రదాయాలను వ్యతిరేకించడమే సెక్యూలరిజం అన్నట్లుగా రాజకీయాలను మార్చేశాయి. ఇలాంటి భావజాలాన్ని వ్యాప్తి చేసిన కారణంగా ఎంతో మంది హిందువులు .. మతోన్మాదానికి వ్యతిరేకం అంటూ.. ముస్లిం, క్రైస్తవ ఇతర గ్రూపులకు మద్దతిస్తారు. కానీ అలాంటి మతమే హిందూత్వం అని నమ్మడం లేదు. ఇలాంటి సూడో సెక్యూలరిజం వల్ల దేశ సాంస్కృతిక పునాదులకు పెను ముప్పు వస్తోంది.
హిందూమతాన్ని కించపర్చడం సెక్యూలరిజం కాదు !
నీ మతాన్ని నీవు గౌరవించు, ఆచరించు.. పర మతాన్ని గౌరవించు.. అదే సెక్యూలరిజం. హిందూ మతాన్ని వ్యతిరేకించు.. ఇతర మతాల్ని గౌరవించు అనేది సూడో సెక్యూలరిజం. ఇప్పుడు దేశంలో ఉన్నది సూడో సెక్యూలరిజం మాత్రమే. తిరుమల విషయంలో జరిగిన అపచారాలను, అవినీతిని ప్రశ్నిస్తే మతోన్మాదం అని కొందరు విమర్శిస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాలని.. తప్పుడు పనులు చేసిన వారిని శిక్షించాలని కోరుకోవడం మతోన్మాదం ఎలా అవుతుంది?. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది ? ఇక్కడ ఇతర మతాలకు చెందిన వారిని ఎవరైనా నిందించారా?. లేనే లేదు. అసలు ఇతర మతాల ప్రస్తావన లేదు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు తిరుప్పరంకుండ్రం ఆలయం దీపం వివాదం కూడా అలాంటిదే. కొండపై దీపం వెలిగించుకోవచ్చని కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదు. పోలీసుల్ని పెట్టి మరీ ఆపేసింది. దీనికి కారణం ఆలయ సమీపంలో సిక్కిందర్ బాదుషా దర్గా ఉండటం వల్ల ముస్లిం సమాజం వ్యతిరేకత వ్యక్తం చేసింది. అందుకే ప్రభుత్వం దీపం వెలిగించడాన్ని వ్యతిరేకించింది. ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయమే చూసుకుంది తమిళనాడు డీఎంకే ప్రభుత్వం. గతంలో సనాతన ధర్మాన్ని అంతం చేయాలని డీఎంకే వారసుడు చేసిన వ్యాఖ్యలు దేశం అంత త్వరగా మర్చిపోదు. సెక్యూలరిజం పేరుతో హిందూత్వంపై చాలా కాలంగా దాడి జరుగుతోంది. చరిత్రలో సనాతన ధర్మం అంటే అర్థం ఏదైనా ఉండవచ్చు. సనాతన ధర్మం అంటే సతీసహగమనం అని కొంత మంది విపరీత అర్థాలు తీస్తూ ఉంటారు. అలాంటి వారు కేవలం వ్యతిరేకతతోనే మాట్లాడుతూంటారు. అప్పటి సనాతన ధర్మం కాదు ఇప్పుడు మనుషులంతా ఒక్కటే అని చెప్పే సనాతన ధర్మమే పాటించాలని కోరుతున్నారు. హిందువులపై వివక్ష చూపించవద్దని అంటున్నారు. ఓ మతాన్ని వ్యతిరేకించాలని ఎవరూ చెప్పరు. అలా చెప్పే మతాలు ఉండవు. ఎవరైనా అలా ఉన్నాయని చెప్పినా అది కల్పితమే.
మతాన్ని వేరు చేయలేనంతగా ముడిపడిన ప్రపంచం
ప్రపంచం మొత్తం జాతులుగా విడిపోయింది. ఆ జాతుల్లో మతాలు ఉన్నాయి. మన దేశంలో అదనంగా కులాలు కూడా ఉంటాయి. మెజార్టీ హిందువులు.. అందుకే మైనార్టీలను అణిచివేస్తున్నారని చెప్పుకుంటారు. ఆరోపిస్తూ ఉంటారు. ఈ కారణం చేతే చాలా మంది హిందువులు కూడా ఆ మైనార్టీ వర్గాలకు మద్దతుగా ఉంటారు. చాలా మంది తమ హిందూత్వాన్ని త్యజించినట్లుగా మాట్లాడుతూ.. సొంత మతాన్ని కించ పర్చడమే సెక్యూలరిజం అంటూంటారు. ఇలాంటి వారు పెరుగుతున్నారు. రాజకీయాలు మతాల్లోకి చొచ్చుకు వచ్చిన తర్వాత మరింతగా పెరుగుతున్నారు. ఆ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఇతర మతాల వారు అయినా ..వారు తమ మతాలను పక్కాగా పాటిస్తున్నా.. ఆ నేత ఆధ్వర్యంలో నడిచే నేతలు మాత్రం హిందూత్వాన్ని, సనాతనాన్ని అవమానిస్తూనే ఉంటారు. ఇక్కడే అసలు కుట్ర చాలా స్పష్టమవుతోంది. హిందువుల్లో విభజన తీసుకురావడం అనేది చాలా ప్రణాళికాబద్ధంగా చేసిన వ్యవహారం. “హిందువులు మెజార్టీ అనే మాట మిథ్య . వారు ఎప్పుడో కులాలు, వర్గాలు, ప్రాంతాలుగా విడిపోయారు” అని పవన్ కల్యాణ్ గురువారం మీడియాతో చేసిన వ్యాఖ్యల్లో ఇసుమంతైనా అతిశయోక్తి లేదా అసత్యం లేదు. హిందువులు ఇప్పుడు మెజార్టీ కాదు. స్వయంగా అంబేద్కర్ ఈ విషయాన్ని చెప్పారు. తన ‘అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్’లో పుస్తకంలో కుల వ్యవస్థ హిందూ సమాజాన్ని శాశ్వతంగా విభజిస్తుందని విశ్లేషించారు. మరోచోట, కులాలు హిందువులను ఒంటరిగా మార్చి, మెజార్టీ భావనను మిథ్యగా చేస్తాయని తేల్చారు. ఇలాంటి విభజనలు చరిత్ర పరంగా హిందువులను రాజకీయంగా బలహీనపరచాయి, మెజార్టీ అనేది కేవలం సంఖ్యల మాయ మాత్రమే అని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి.
హిందువులు కుల, ప్రాంత, వర్గాలుగా విడిపోయారు !
సంఖ్యాపరంగా చూసుకుంటే మన దేశంలో హిందువులే మెజార్టీ. ప్రపంచంలోనే అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం జనాభా 121.09 కోట్లలో హిందువులు 79.8 శాతం అంటే సుమారు 96.63 కోట్లు మంది హిందువులు ఉన్నారు. 2025లో భారత జనాభా UN అంచనాల ప్రకారం 147 కోట్లు అయితే.. హిందువులు 78-80 శాతం మధ్యఉంటారు. వారి సంఖ్య సుమారు 110 కోట్లు అని అంచనా. ఈ లెక్కలు చూస్తే హిందూత్వానికి తిరుగులేదని అనుకుంటారు. కానీ జరుగుతున్నది వేరు. రాజకీయ పార్టీలు అనాదిగా మైనార్టీ ఓట్ల కోసమే ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే హిందువుల్లో ఐక్యత లేదు కాబట్టి. భారత స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పార్టీగా, మైనారిటీల ఓటులను సమర్థించుకోవడానికి సెక్యులర్ విధానాలను అమలు చేసింది. ఇక్కడ సెక్యూలర్ అంటే మైనార్టీలపై ఎక్కువగా ప్రేమ చూపడం. హిందువులను కించపర్చడం. ఇది ఎలా సెక్యూలర్ అవుతుందన్న విషయం పక్కన పెడదాం. కానీ అనాదిగా కాంగ్రెస్ సహా చాలా పార్టీలు చేస్తున్నది ఇదే. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉత్తరప్రదేశ్, బిహార్‌లో మైనారిటీలపై ఓటు బ్యాంకు వ్యూహాలు అమలు చేశాయి. 2024 ఎన్నికల్లో, ముస్లిం ఓట్లు 38 శాతం కాంగ్రెస్‌కు వచ్చాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తున్న హిందూత్వ రాజకీయాలు ఎందుకు విజయవంతమయ్యాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మైనార్టీలకు పెద్దపీట వేస్తూ తమకు చారిత్రకంగా అన్యాయం చేస్తున్నారన్న భావన హిందువుల్లో పెరిగిపోవడం వల్లనే .. ఆ భావనను రాజకీయంగా బీజేపీ క్యాష్ చేసుకుంటోంది.
హిందూత్వం బీజేపీ పేటెంట్ కాదు.. అలాంటి పరిస్థితి సృష్టించింది ఇతర పార్టీలే !
అసలు హిందూత్వానికి బీజేపీకి సంబంధంలేదు. ఇతర పార్టీలు కేవలం మైనార్టీలకు పేరుతో కొన్ని వర్గాలను అప్పీజ్ చేస్తూ.. హిందువుల్ని దూరం పెట్టడం వల్ల ఆ గ్యాప్ ను ఫిల్ చేసి.. మెజార్టీ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా రాజకీయంగా విజయం సాధించారని సంఘ్ పుట్టుకు వచ్చింది. సంఘ్ ఇప్పుడు బీజేపీగా మారింది. సంఘ్ పుట్టుక..బీజేపీగా మారిన వైనం.. దేశమంతా ఎలా విస్తరించిందో సూడో సెక్యూలరిస్టులు ఒక్క సారి తమను తాము విశ్లేషించుకుంటే.. తాము చేసిన తప్పేమిటో సులువుగా అర్థమైపోతుంది. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది రాజకీయం కోసం హిందూత్వాన్ని నిర్లక్ష్యం చేశారు. హిందువుల్ని కులం, ప్రాంతం సహా ఏ అంశం దొరికితే దాంతో విడదీశారు. ఫలితంగా ఇప్పుడు దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నా.. హిందూత్వంపై నిరభ్యంతరంగా దాడి చేయగలుగుతున్నారు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్ర హృదయంతో స్వీకరించే ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన నిందితులు ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. తప్పు చేశారు అని హిందూ సమాజం అంతా.. వారి చొక్కా పట్టుకుని ప్రశ్నించడం లేదు. పైగా జంతువుల కొవ్వు కలవలేదుగా అని ఎదురుదాడి చేస్తున్నారు. ఇంత ధైర్యం వారికి ఎలా వచ్చింది?. హిందువుల్లో అనైక్యత వల్లే పచ్చింది. ఆ విషయాన్ని సహజంగానే ఒప్పుకోరు. ఇప్పుడు హిందువులు, హిందువులుగా లేరు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా.. పార్టీల వారీగా ఇంకా చెప్పాలంటే.. సినీ హీరోల అభిమానుల వారీగా విడిపోయారు. ఇప్పుడు హిందువులు దేశంలో మెజార్టీ కాదు.
పెను ముప్పుగా మారిన మత మార్పిళ్లు
రాజకీయాలకు మతం ఓ ఆయుధంగా మారింది. తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి హిందువుల్ని తగ్గించేందుకు చాలా ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు జరిగాయి. జనాభా నియంత్రణ పూర్తిగా హిందువులకే పరిమితమయింది. మైనార్టీ వర్గాల వారు ఎవరూ ఈ నియంత్రణ పాటించడం లేదు. అదే సమయంలో మత మార్పిళ్లు ఓ ఉద్యమంలా జరిగాయి. లెక్కల ప్రకారం 80 శాతం మంది హిందువులు అంటారు కానీ.. అందులో మతం మార్చుకున్నవారి సంఖ్య రికార్డుల్లో ఉండదు. ఇప్పుడు రికార్డుల్లో వంద శాతం హిందువులు ఉన్న ఓ గ్రామానికి వెళ్లి చూడండి..ఖచ్చితంగా చర్చిలు ఉంటాయి. హిందువులు మాత్రమే ఉండే ఊళ్లల్లో చర్చిలు ఎందుకు ఉంటాయి?. సమాజంలో మీపై ఇతర కులాల వారు విపక్ష చూపిస్తున్నారని రెచ్చగొడుతూ కొన్ని కులాల్లో విపరీతంగా మత మార్పిళ్లు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మతం మారుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీలు 70 శాతం మంది ఉంటారు. వారిలో అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరా చేసుకుని ఇలా మతం మారుస్తున్నారు. ఇలా కనీసం పది శాతానికిపైగా హిందువులు కన్వర్టడ్ క్రిస్టియన్స్ గా మారారు. వారు ఎంత బలంగా మారారంటే రాజకీయ పార్టీలు వారికి కూడా రిజర్వేషన్లు ఇస్తామని తాయిలాలు ప్రకటిస్తున్నాయి. అంటే వారి శాతం ఎంత ఎక్కువగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు క్రైస్తవంలోకే కాదు.. ఇస్లాంలోకి కూడా హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు. కేరళతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ మత మార్పిళ్లు ఓ ఉద్యమంలా చేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల్లో 80 శాతానికి మందికిపై క్రైస్తవంలోకి తీసుకువచ్చారనేది అందరికీ తెలిసినా తెలియనట్లుగా నటించే నిజం. హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు హిందువుల హక్కుల కాలరాస్తున్నాయి. ఎవరి హక్కులు వారికి ఉండాలి. ఒకరి కోసం మరొకర్ని కించపర్చకూడదు. కానీ రాజకీయం చేస్తోంది అదే. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసి, హిందూ ఐక్యతను దెబ్బతీస్తే, BJP హిందూ మెజారిటీని మొబిలైజ్ చేసి మైనారిటీలను మార్జినలైజ్ చేస్తుంది. ఇది సెక్యులరిజాన్ని బలహీనపరుస్తుంది, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన మార్పు డెవలప్మెంట్-బేస్డ్ పాలసీలతో వస్తుంది, కానీ ఎన్నికల వ్యవస్థ వోటు బ్యాంక్‌లను ప్రోత్సహిస్తూనే ఉంది. ఈ వ్యూహాలు భారత డెమోక్రసీని పోలరైజ్ చేస్తున్నాయి. దీని వల్ల సమాజం ఎప్పుడూ ఓడిపోతోంది.
హిందూత్వం అంటే బీజేపీని సమర్థించడం కాదు. హిందూత్వం అంటే కాంగ్రెస్ ను వ్యతిరేకించడం కాదు. సనాతనం అంటే సతీసహగమనం కాదు. ఏ మతంలో పుట్టాలన్నది ఎవరి చాయిస్ కాదు. అందరూ ఏదో ఓ మతంలో పడతారు. ఎవరి మతాల్లో మంచికి తగ్గట్లుగా వారు మసలుకుంటారు. ప్రతీ మతం మంచినే బోధిస్తుంది. అది తెలుసుకున్న రోజునే సెక్యూలరిజం రాజకీయ ఆయుధంగా నిర్వీర్యం అవుతుంది. కానీ రోజు కనుచూపుమేరలో కనిపించడం లేదు.
