భారత ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి ట్రేడ్ డీల్ పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద గేమే ఆడాడు. ద్వేపాక్షిక వాణిజ్యం పేరుతో బెదిరించి ఏ పనులైనా చేయించుకోవచ్చని అనుకుంటున్నాడు. కానీ భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన పెట్టే షరతులకు సిద్ధంగా లేమని సైలెంటుగా అయిపోయింది. దీంతో భారత్ పై పన్నులు విధించడమే కాకుండా.. పాకిస్తాన్ కు చాలా దగ్గర అవుతున్నామని సంకేతాలు ఇచ్చారు. పాకిస్తాన్ లో ఓ పెద్ద చములు నిల్వల కేంద్రాన్ని స్థాపించేందుకు ఒప్పందం చేసుకున్నారు.
పాకిస్తాన్ కు ఇప్పుడు వేరే గతి లేదు. చైనాకు వెళ్లిన ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్‌పై పబ్లిక్ గా .. అక్కడ ప్రభుత్వ పెద్దలు గద్దించి, అవమానించినా కిక్కురుమనే పరిస్థితిలేదు. అలాగే అమెరికా ఏం చెప్పినా చేయాల్సిన పరిస్థితిలో ఉంది. లేకపోతే దివాలా తీస్తుంది. ఉగ్రవాదులు, సైన్యం చేతుల్లోకి ప్రభుత్వం వెళ్లిపోతుంది. అందుకే ట్రంప్ పాకిస్తాన్ తో ఏదో చేద్దామని బయలుదేరారు. కానీ పాకిస్తాన్ చైనా చేతిలో పావు అని ట్రంప్ గుర్తించకపోవడమే అసలు అమెరికా అమాయకత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
అమెరికా ఉత్పత్తులకు తక్కువ పన్నులతో తలుపులు బార్లా తెరిచి… మన స్థానిక ఉత్పత్తులకు అన్యాయం చేస్తే .. వచ్చే లాభం కన్నా.. వచ్చే కీడు కూడా ఎక్కువగా ఉంటుంది. ముందు మన మార్కెట్ ను అమెరికా ముంచెత్తకుండా కాపాడుకోవాలి. అమెరికా ఏమీ దయాదాక్షిణ్యాలతో మన వద్ద నుంచి వ్యాపారం చేయడం లేదు. వారికి అవసరం అయినవి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ట్రంప్ సుంకాల వల్ల అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారు.
సుంకాల విషయంలో భారత ప్రభుత్వ విధానం.. భారతీయుల అవకాశాలు దెబ్బతీయకుండా.. అమెరికాకు లొంగకుండా ఉంది. పాకిస్తాన్ పేరుతో ట్రంప్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా పేరుతోనూ అంతే. కానీ భారత్ తన ప్రయోజనాలు తాను కాపాడుకునే విషయంలో ధృడంగా వ్యవహరించాల్సి ఉంది.