భారత రాజకీయాలు ఎప్పుడూ వేడెక్కిన పెనం మీదనే ఉంటాయి. ఎన్నికలు ఎదురుగా ఉన్నా.. పదేళ్ల తర్వాత ఉన్నా పరిస్థితి మారదు. అలాంటి రాజకీయాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. అందరూ .. భారత్ మాతాకీ జై అనే నినాదమే చేస్తున్నారు. దేశంలో రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నా.. దేశానికి సంబంధించి మాత్రం అందరూ ఒక్కటయ్యారు. ఎవరైనా ఒకరిద్దరు పాకిస్తాన్ దాడులకు వ్యతిరేకంగా మాట్లాడినా ప్రజలు వారిని పట్టించుకోవడం మానేశారు.
ఉగ్రవాదులపై సంఘటిత యుద్ధం
పహల్గాంలో జరిగిన దాడి చిన్నది కాదు. ఇరవై ఆరు మంది ప్రాణాలతు మాత్రమే కాదు.. అది భారత్ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన ఘటన. మన భూభాగంలోకి వచ్చి ఉగ్రవాదులు చేసిన సవాల్. అది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారం రోజుల ముందు హెచ్చరించి చేయించిన ఘోరం. ఇలాంటి వాటిని ఉపేక్షించాలని ఏ దేశమూ అనుకోదు. ఇవాళ సైలెంట్ గా ఉంటే.. రేపు మరో దాడితో వస్తారు. అలాంటి పని చేయకుండా ముందే వారిని లేపోయాల్సి ఉంటుంది. మసూద్ అజర్ కుటుంబం మొత్తం చచ్చిపోయింది. ఇప్పుడు వాడికి తాను చేస్తున్న ఉగ్రవాదం వల్ల జరిగిన నష్టమేంటో ప్రత్యక్షంగా తెలుస్తుంది.
దేశం కోసం రాజకీయం !
పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ చేసిన దాడులపై రాజకీయ పార్టీలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ సహా అందరూ సైన్యాన్ని ప్రశంసించారు. దేశం కోసం సాహసం చేసిన వైనాన్ని అభినందించారు. ఈ క్రెడిట్ కోసం ఏ ఒక్క పార్టీ ప్రయత్నం చేయడం లేదు. అది కూడా మంచి ప్రయత్నమే. దాడుల ఘనత మాదేనని చెప్పుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నిస్తే అది రాజకీయం అవుతుంది. అందరూ ఈ విషయంలో దేశం ఫస్ట్ అనే రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచి అందరికీ ఏం జరిగిందో చెప్పింది కూడా.
దేశభద్రత అంశాల్లో ఏకతాటిపై ఉంటే తిరుగుండదు !
దేశ అంతర్గత అంశాల్లో ఎన్ని రాజకీయాలు చేసుకున్నా సరే.. కానీ భారత అంతర్గత భద్రతకు ముప్పు వస్తే మాత్రం సహించే ప్రశ్నే ఉండదు. సరిహద్దుల్లో అలజడి రేపాలన్న ఆలోచన కూడా చేయకూడనంత బాగా సమాధానం ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్ అలాంటిదే . ఇది అంతటితో ఆగిపోతుందని అనుకోవడం లేదు. చివరి టెర్రరిస్టును చంపే వరకూ.. అవిశ్రాంతంగా పని చేయాలి. అప్పుడే ప్రపంచానికి భద్రత ఉంటుంది.