అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకోవాలంటే.. తాము చెప్పినట్లుగా ఒప్పుకోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై పంతం పడుతున్నారు. భారతదేశంతోనూ గీచి గీచి బేరాలాడుతున్నారు. ట్రేడ్ డీల్ దాదాపుగా ఫైనల్ కు వచ్చిందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఓ అంశంపై పీటముడి పడినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే.. నాన్ వెజ్ మిల్క్. అమెరికా నాన్ వెజ్ మిల్క్ ను ఇండియాలో డంప్ చేస్తామని పన్నులు తక్కువగా ఉంచాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
మనకు పాలు తెలుసు కానీ అందులో వెజ్, నాన్ వెజ్ ఉంటుందని తెలియదు. కానీ అమెరికన్లకు తెలుసు. వారు గోవులకు మాంసాహారం పెడతారు. గోవులకు.. మిగిలిపోయిన మాంసం వ్యర్థాలతో తయారు చేసిన ఆహారాన్ని పెడతారు. అలాంటి ఆవుల నుంచి వచ్చే పాలను నాన్ వెజ్ పాలు అంటారు. వాటిలో ప్రోటీన్లు ఉంటాయని చెబుతూంటారు. అయితే ఆ పాలు ఇప్పటి వరకూ భారత్ లోకి దిగుమతి కాలేదు. భారత్ లో పాడి పరిశ్రమ చాలా బలంగా ఉంటుంది. వినియోగం కూడా ఎక్కువే. దిగుమతులు తక్కువ. అయితే భారత మార్కెట్ పై ట్రంప్ కన్నేసి నాన్ వెజ్ పాలను తక్కువ ధరకు డంప్ చేయాలని చూస్తున్నారు.
పాల విషయంలో భారత ప్రజలకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని దేవుడికి నైవేద్యంగా పెడుతూంటారు. నాన్ వెజ్ పాలు అంటే.. అవి కల్తీగానే భావిస్తారు. అలాంటి వాటిని భారత్ లోకి అనుమతిస్తే కేంద్రంపై విమర్శలు పెరుగుతాయి. అందుకే కేంద్రం అమెరికాకు ఏ విషయమూ చెప్పలేకపోతోంది. ఆ పాలను అంగీకరించేది లేదని… తక్కువ ధర ఉండేలా తక్కువ టాక్సులు వేయడమూ సాధ్యం కాదని అంటోంది. మరి ట్రంప్ ఒత్తిడి నెగ్గుతుందా..? మోదీ పంతమే ఫైనలా అన్నది ట్రేడ్ డీల్ ను బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.