ఇంగ్లండ్‌కు భారీ స్కోరు సమర్పించుకొన్న భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం ఆకట్టుకొంటోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తన బాధ్యత గుర్తుంకొని, ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడుతుండడంతో.. భారత్ మూడో రోజు తేరుకొంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ స్కోరు (537) పరుగులకు బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ధీటుగానే సమాధానం ఇస్తోంది. కడపటి వార్తలు అందేసరికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఓపెనర్ విజయ్ (112 బ్యాటింగ్), పూజారా(124) తమ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేశారు. విజయ్‌కి అండగా కెప్టెన్ కోహ్లి (0 బ్యాటింగ్) బరిలో దిగాడు. మూడో రోజు ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న నిలకడగా ఆడిన గంభీర్ (29) తొందరగానే అవుటై పెవీలియన్ చేరాడు. వన్ డౌన్ గా బరిలోకి దిగిన పూజారా.. ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బౌన్సర్లను ఆడడానికి ఇబ్బంది పడిన పూజారా.. మధ్యలో కాస్త అలసటకు గురైనట్టు కనిపించాడు. అయితే ఆ తరవాత.. ఆ ఇబ్బందినీ అధిగమించి యదేచ్ఛగా షాట్లు కొట్టాడు. పూజారా ఇన్నింగ్స్ లో ఒక్క లేజీ షాట్ కూడా లేదంటే… ఎంత అద్భుతంగా ఆడాడో అర్థం చేసుకోవొచ్చు. మరోవైపు విజయ్ కూడా ఆచి తూచి ఆడుతూ.. వీలైనప్పుడల్లా భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి రికార్డు స్థాయిలో 209 పరుగులు సాధించారు. వీరిద్దరి దూకుడుతో భారత్ ఫాలో ఆన్ గండం దాదాపుగా దాటేసినట్టే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో మూడు, భారత ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకూ 2 మొత్తానికి 5 సెంచరీలు నమోదయ్యాయి. మున్ముందు ఇంకెన్ని సెంచరీలు చూస్తామో. పిచ్ పరిస్థితి చూస్తుంటే… తొలి టెస్టు డ్రా అయ్యేట్టే కనిపిస్తోంది.