ఛాంపియ‌న్ భార‌తా-పాకిస్థానా!

క్రికెట్ క్రీడంటే భార‌త్ చెవి కోసుకుంటుంది. ప‌నుల‌న్నీ ప‌క్క‌న పెట్టి మ‌రీ టీవీల‌కు అతుక్కుపోతుంది. భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు ముఖాముఖి త‌ల‌ప‌డుతున్నాయంటే ఆస‌క్తి వంద‌రెట్ల‌వుతుంది. ఇరుదేశాల మ‌ధ్య నెల‌కొన్న వైరాలు ఇందుకు కార‌ణ‌మ‌ని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎవ‌రి చేతిలోనైనా ఓడిపో కానీ ఇండియా చేత ప‌రాజ‌యం పాలుకాకూడ‌ద‌ని పాకిస్తాన్‌… పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని భార‌త్ భావిస్తుంటాయి. ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో ఆ ముద్ర ఇప్ప‌టికీ అలాగే ఉండిపోయింది. మిగిలిన మ్యాచ్‌ల సంగ‌తెలా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌పంచ స్థాయి స‌మ‌రాల్లో ఎప్పుడూ భార‌త్‌దే పైచేయిగా ఉంటోంది.

తాజాగా చాంపియ‌న్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లూ టైటిల్ పోరులో త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఆదివారం అంటే ఈనెల 18న ఓవ‌ల్‌లో ఈ మ‌హాస‌మ‌రం చోటుచేసుకోబోతోంది. ఎప్పుడు ఇలాంటి సంద‌ర్భం ఎదురైనా దాదాపు ప‌ది కోట్ల మంది ఈ మ్యాచ్‌ను క‌ళ్ళ‌ప్ప‌గించి చూస్తార‌ని ఒక అంచ‌నా. టెస్టుల్లోనూ, వ‌న్డేల్లోనూ విజ‌యాల‌లో పాకిస్తాన్‌దే పైచేయి. ఇంత‌వ‌ర‌కూ 59 టెస్టుల‌కు గానూ పాకిస్తాన్ 12, ఇండియా తొమ్మిది టెస్టుల్లో గెలుపొందాయి. 128 వ‌న్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ 72, ఇండియా 52 మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించాయి. 8 టి 20 మ్యాచ్‌ల‌లో భార‌త్ ఏడు గెలిచింది. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లోనే గెలుపును ద‌క్కించుకుంది.

1952 అక్టోబ‌ర్ 16-19మ‌ధ్య రెండు జ‌ట్లూ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాయి. 1978 అక్టోబ‌ర్ ఒక‌టిన తొలి వ‌న్డేలోనూ, 2007 సెప్టెంబ‌ర్ 14న తొలి టీట్వంటీలోనూ భార‌త్‌-పాక్‌లు తొలి మ్యాచ్‌లు ఆడాయి. 1954-55 సీజ‌న్‌లో భార‌త జ‌ట్టు తొలిసారి పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింది.1951-52లో పాకిస్థాన్ ఇండియాలో మ్యాచ్‌లాడింది. రెండు దేశాల మ‌ధ్య 1965, 1971ల్లో యుద్ధాల కార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. 1999లో కార్గిల్ యుద్ధం, 2008లో ముంబై పేలుళ్ళ కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. విచిత్రంగా రెండు దేశాలు త‌మ సంబంధాల‌ను మెరుగు ప‌ర‌చుకోవ‌డానికి త‌ర‌చూ క్రికెట్ దౌత్యాన్ని ఆశ్ర‌యించ‌డం విశేషం.

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ప్పుడు 98 ల‌క్ష‌ల 80వేల మంది టెలివిజ‌న్ల‌లో ఈ మ్యాచ్‌ను చూశారుట‌. 2015 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల విక్ర‌యం మొద‌లైన 12 నిముషాల్లోనే అన్నీ అమ్ముడైపోయాయిట‌. ఈ ఒక్క ఉదంతం చాలు భార‌త్-పాక్ మ్యాచ్‌కు ఉన్న ఆస‌క్తిని తెల‌ప‌డానికి.

తాజాగా రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌రిగే చాంపియ‌న్స్ ట్రోఫీలో రెండు జ‌ట్ల‌కూ స‌మానావ‌కాశాలున్నాయి. టోర్న‌మెంటు ప్రారంభంలో పాక్ ఆట తీరు చూసి, సెమీస్‌కు వ‌స్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. త‌రువాతి రెండు మ్యాచ్‌లో పోరాట ప‌టిమ‌క‌న‌బ‌రిచి సెమీస్‌కు చేరింది. ప్ర‌ధానంగా డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీ‌లంక‌తో ఆడిన తీరు చిరస్మ‌ర‌ణీయం. ఇక‌, భార‌త్ ప్ర‌స్తుతం అత్యంత ప‌టిష్టంగా ఉంది. బ‌హుశా ఏ జ‌ట్టుకూ ఇంత బ‌లీయ‌మైన బ్యాటింగ్ లైన‌ప్ లేదేమో. భార‌త్‌పై తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పాకిస్థాన్‌కు కొద్దిగా నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేదే. ఎవ‌రు గెలిచినా ఓడినా.. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల‌కు విందుభోజ‌న‌మే. కోడిపుంజుల్లా కొట్లాడే ఆట‌గాళ్ళ‌ను, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌నూ చూసి తీరాల్సిందే. రెండు జ‌ట్ల‌కూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.