చైనా కన్నా ఎక్కువగా భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్. అందులో సందేహం లేదు. బయటకు చెబుతోంది ఒకటి..చేస్తోంది ఒకటి. తీసుకుంటున్న నిర్ణయాలన్నీ భారత్ ను గురి పెట్టేవే. భారతీయుల్ని లక్ష్యంగా చేసుకునేవే. అందుకే ఇది సంక్షోభం అని కొంత మంది అంటున్నారు. కానీ అమితాబ్ కాంత్ లాంటి నిపుణులు మాత్రం ఇది సంక్షోభం కాదు గొప్ప అవకాశం అంటున్నారు. పాజిటివ్ గా ఆలోచిస్తే ఇదే నిజం. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవడం మాత్రం మన చేతుల్లో అంటే మన ప్రభుత్వాలు, యువత చేతుల్లోనే ఉంది.
మేథో వలసే మన దేశానికి అతి పెద్దశాపం
అమెరికాలో ఉన్న నిపుణుల్లో అత్యధిక మంది భారతీయులే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఫేస్బుక్ ఆలోచన వచ్చింది దాన్ని ప్రాథమికంగా వృద్ధి చేసింది భారతీయ మూలాలున్న వ్యక్తే. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న టెక్నాలజీలు.. ఫార్మా ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కీలకం. కానీ వారంతా అమెరికా నుంచే ఆ పని చేశారు కాబట్టి ఆ దేశానికి మేలు జరిగింది. అక్కడ ఆ ఎకోసిస్టమ్ ఉండబట్టి వారు వెళ్లారు. వైద్యులు, ఇంజినీర్లు సహా అన్ని వర్గాల మేథోవలస అమెరికాకు జరిగింది. ఆ మేరకు అమెరికా లాభం.. మనకు అతి పెద్దశాపంగా మారింది.
ఇప్పుడు అవకాశాలను అందిపుచుకునే చాన్స్
ఒకప్పుడు ప్రతిభావంతులంతా అమెరికాకు వెళ్లడానికి క్యూ కట్టారు అంటే.. వారి ఆలోచనలకు తగ్గట్లుగా ఇక్కడ అవకాశాలు లేవని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొత్తగా యువతరం ఏం చేయాలనుకున్నా.. చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే తక్కువ పెట్టుబడితోనే పనైపోతుంది. ఓ గూగుల్ ని.. మరో చాట్ జీపీటీని సృష్టించడానికి కూడా అవకాశం ఉంది. చాట్ జీపీటీ సృష్టిలోనూ సుచిర్ బాలాజీ అనే ఇండియన్దే కీలక పాత్ర. తర్వాత అతను అనుమానాస్పదంగా చనిపోయాడు. అందుకే ఇప్పుడు.. ఏం చేయాలనుకున్నా.. ఇండియా నుంచే చేయడానికి అవకాశం.
ఇబ్బందులు ఉంటాయి.. అధిగమించి సక్సెస్ సాధిస్తేనే కిక్ !
అమెరికా టార్గెట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. సాఫీగా సాగిపోతున్న జీవితానికి ఒడిదుడుకులు వస్తాయి. కానీ వాటిని అధిగమించి విజయం సాధించినప్పుడే అసలు కిక్ వస్తుంది. అలాంటి విజయమే మధురంగా ఉంటుంది. ఇప్పుడు భారత్ ట్రంప్ పెడుతున్న ఇబ్బందుల్ని అధిగమించి.. అమెరికాను దాటేలా .. విజయాలు సాధిస్తే.. అదే అసలైన కిక్ వస్తుంది. అప్పుడు అమెరికన్లలో భారత వీసాల కోసం..ఇక్కడ పని చేయడానికి క్యూ కట్టాల్సి రావొచ్చు. ప్రయత్నిస్తే ఇది అసాధ్యమైన విషయమేం కాదు.