సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలవ్వబోతోంది. ఈ టోర్నీకి స్పెషల్ ఎట్రాక్షన్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్లాష్. అందరూ ఎదురు చూస్తున్నది సెప్టెంబర్ 14 మ్యాచ్ కోసం. ఆ రోజే పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ పై ఒక డైలెమా నడుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో “పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు వద్దు” అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ లెజెండ్స్ టీమ్ మాస్టర్స్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌ని రద్దు చేసుకుంది. టీమ్ ఇండియా కూడా అదే దారిలో వెళ్ళాలని ఈసారి కొందరు మాజీలు, ఫ్యాన్స్ నుంచి కూడా బలంగా వినిపిస్తోంది.
అయితే బోర్డుకి మాత్రం ఈ మ్యాచ్‌ని ఆడించాలనే ఉంది. దీనికోసం పక్కా పేపర్ వర్క్ చేసుకున్నారు. ఆగస్టులో ఓ ప్రత్యేక రూల్ బుక్ రెడీ చేసి దానిపై రాజముద్ర కూడా వేయించుకున్నారు. ఆ క్లాజ్ ఏమిటంటే.. ‘టీమ్ ఇండియా శత్రుదేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉంటుంది. కానీ, మల్టీనేషనల్ ఈవెంట్లలో మాత్రం పాల్గొంటుంది. కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాలను బీసీసీఐ ఖచ్చితంగా పాటించాలి.
ఈ విషయమై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ క్లారిటీ ఇచ్చారు. “మల్టీనేషనల్ వేదికలపై భారత్‌తో స్నేహపూర్వకంగా లేని దేశాలతో ఆడటంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్లలో అన్ని మ్యాచ్‌లు భారత్ ఆడుతుంది” అని ప్రకటించారు. ఈ వివరణతో ఇండియా, పాకిస్థాన్ బరిలో దిగుతాయనేది స్పష్టమైంది.
నిజానికి ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ రెండు జట్లే. అటు కేంద్రం, ఇటు బోర్డ్.. భారత్-పాక్ మ్యాచ్‌పై సానుకూలంగానే ఉన్నాయనే సంకేతాలు సైకియా ప్రకటనతో అందాయి. మొత్తానికి సెప్టెంబర్ 14న జరగబోయే భారత్-పాక్ పోరుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయినట్లే.