సొంత గడ్డపై భారత్ విజృంభించింది. ఫైనల్లో కివీస్ ని చిత్తు చేసి.. మూడోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. 2007లో తొలిసారి పొట్టి ప్రపంచకప్ అందుకొన్న భారత్, 2024లో దక్షిణాఫ్రికాని ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకొంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కివీస్ 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బుమ్రా 4 వికెట్లతో కివీస్ ని కట్టడి చేశాడు. భారత ఓపెనర్లు అభిషేక్, సంజూ విజృంభించడంతో గట్టి పునాది వేసుకొంది. తొలి 6 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 92 పరుగులు చేసింది. ఆ తరవాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దుబేలు వేగంగా పరుగులు సాధించారు. సంజూ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 89 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ కి వెన్నుముకగా నిలిచాడు. తనకు ఈ టోర్నీలో వరుసగా మూడో అర్థ సెంచరీ. చివర్లో వరుసగా వికెట్లు పడినా దుబే.. దూకుడు కొనసాగించాడు. చివరి ఓవర్లో రెండు సిక్సులు రెండు ఫోర్లతో జట్టు స్కోరు 250 పరుగులు దాటించాడు.
ఛేజింగ్ లో కివీస్ ఏ దశలోనూ రన్ రేట్ దరి దాపుల్లో కూడా రాలేకపోయింది. దానికి తోడు బుమ్రా యార్కర్లకు సమాధానం లేకుండా పోయింది. కివీస్ జట్టులో టిమ్ సెఫ్రిట్ ఒక్కడే 52 పరుగులతో రాణించాడు. మిగిలినవాళ్లు ఒత్తిడి తట్టుకోలేక వికెట్లు సమర్పించుకొన్నారు. చివరికి ఇండియా 96 పరుగుల తేడాతో విజయదుంభీ మోగించింది. ఫైనల్లో ఇంత పెద్ద మార్జిన్ తో ఓ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి. వరుసగా మూడు అర్థ సెంచరీలతో భారత్ జైత్రయాత్రలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్ కి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
