✍ డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. కలల దేశం భయపెడుతోంది. అగ్రరాజ్యం అమెరికా పేరు వింటేనే భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏదైతే జరగకూడదని అనుకున్నామో.. అదే జరుగుతోంది. ఇక అమెరికా ఎంత మాత్రం సేఫ్ కాదు.. అన్న వాదనలు బలపడుతున్నాయి. మొన్న వంశీ, నిన్న కూచిభొట్ల శ్రీనివాస్, హర్నీప్ పటేల్.. తాజాగా సిక్కు యువకుడు.. అమెరికాలో మరో ఘోరం జరిగిపోయింది. భారతీయులపై వరుసగా జాతి విద్వేషపు దాడులు జరుగుతున్నాయి. కూచిభొట్ల శ్రీనివాస్, హర్నీష్ పటేల్ దారుణహత్యల విషాదం నుంచి కోలుకోకముందే గుర్తు తెలియని దుండగుడు మరో భారతీయుడిపై కాల్పులు జరిపాడు.
? అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్ రాష్ట్రంలోని కెంట్ నగరంలో సిక్కు వ్యక్తి దీప్ రాయ్ (39)పై ఆయన ఇంటి బయటే కాల్పులు జరిపాడు. అంతేకాదు ‘మీ దేశానికి వెళ్లిపో’ అంటూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దీప్ రాయ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దీప్ రాయ్ కు అమెరికా పౌరసత్వం ఉంది.
దీప్ రాయ్ ఇంటి బయట కారు వద్ద ఉండగా ఓ అపరిచిత శ్వేతజాతి వ్యక్తి ఆయనతో వాదనకు దిగాడు. దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఉన్మాదంతో అరుస్తూ దుండగుడు కాల్పులు జరపగా, దీప్ రాయ్ చేతిలో బుల్లెట్ దూసుకెళ్లింది. దుండగుడు ఆరడుగుల పొడవున్నాడని, ముఖానికి మాస్క్ ధరించాడని దీప్ రాయ్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కెంట్ పోలీస్ అధికారి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో బాధితుడు, ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు.
? జాత్యహంకార దాడులు అమెరికాలో ఉంటున్న భారతీయులను, ఇండియాలో ఉంటున్న వారి బంధువులను బెంబేలెత్తిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం కలకలం రేపుతోంది. శ్రీనివాస్ కూచిభొట్ల ఘటన తర్వాత ఇలాంటి దాడులు జరగవని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామమాత్రపు ప్రకటన చేసి చేతులుదులుపుకున్నారు. భారతీయులపై జాత్యహంకార దాడులు జరగడానికి, పెరగడానికి ఒక రకంగా ట్రంపే కారణం అనే వాదన వినిపిస్తోంది. మన దేశం, మన ఉద్యోగాలు అంటూ వలసవాదులు, విదేశీయులను ఉద్దేశించి ట్రంప్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమెరికన్లలో అసహనాన్ని పెంచాయనే భావన ఉంది. విదేశీయుల వల్లే తమకు ఉద్యోగాలు దొరకడం లేదన్న భావన అమెరికన్లలో పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే వారు జాత్యహంకార దాడులకు తెగబడుతున్నారని అమెరికాలో ఉంటున్న విదేశీయులు అంటున్నారు. ఏది ఏమైనా ఇక అమెరికా ఎంత మాత్రం సేఫ్ కాదు అనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. అమెరికాలో ఉంటున్న భారతీయులు.. ఇంటి బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయలేకపోతున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అయితే ఉద్యోగాలను వదులుకుని ఉన్న పళంగా వెనక్కి రాలేరు, అలా అని ప్రాణ భయంతో అమెరికాలో ఉండలేరు.. ఇదీ అమెరికాలో ఉంటున్న భారతీయులు దయనీయ స్థితి.