భారత రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా పతనమవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన రేకెత్తిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 95 మార్కుకు చేరుకోవడం ఒక చారిత్రక కనిష్ట స్థాయిగా నమోదైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇజ్రాయెల్ వంటి దేశాల కరెన్సీ షెకెల్ కూడా ఇంతటి వేగంగా పతనం కాలేదు. యుద్ధం జరుగుతున్నప్పటికీ ఆ దేశ కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల వారి కరెన్సీ నిలకడగా ఉంది. కానీ, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారత్‌లో రూపాయి ఇంత బలహీనపడటం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది.
ఒక్క రూపాయి కరెన్సీనే ఎందుకు బలహీనం?
ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా కొన్ని దేశాల కరెన్సీలు డాలర్ సవాలును తట్టుకుని బలంగా నిలబడుతున్నాయి. ముఖ్యంగా స్విస్ ఫ్రాంక్, సింగపూర్ డాలర్ వంటివి తమ స్థిరత్వాన్ని చాటుకుంటున్నాయి. మన పొరుగున ఉన్న కొన్ని ఆసియా దేశాల కరెన్సీలు సైతం రూపాయి కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, దిగుమతుల ఖర్చు పెరగడం ,అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రూపాయి పతనం వల్ల సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం పడి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఆర్బీఐ బాధ్యత లేదా ?
రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూపాయి విలువ పడిపోతుంటే అది కేవలం అంతర్జాతీయ పరిణామాల వల్లేనని సరిపెట్టుకోవడం కాకుండా, వ్యవస్థాగతమైన చర్యలు తీసుకోవడంలో కేంద్రం జాప్యం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. విదేశీ మారక నిల్వలను సమర్థవంతంగా వినియోగించి మార్కెట్లోకి డాలర్లను విడుదల చేయడం ద్వారా రూపాయిని కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో చూపించాల్సినంత వేగం ,ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
రూపాయికి ఆక్సిజన్ ఎలా ఇస్తారు?
దేశీయంగా ఎగుమతులను పెంచి, అనవసర దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయికి జవజీవాలు పోయవచ్చు. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా దీర్ఘకాలిక విధానాలను రూపొందించాలి. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే అది దేశ ఆర్థిక పునాదులనే దెబ్బతీసే ప్రమాదం ఉంది. కేవలం అంకెల్లో వృద్ధిని చూపడం కంటే, కరెన్సీ విలువను కాపాడుకోవడం ద్వారా దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని రూపాయికి ఆక్సిజన్ అందించే దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
