“ దేవుడికి కృతజ్ఞతలు నా అండర్ వేర్ డాలర్.. అదే రూపాయి అయి ఉంటే పదే పదే జారిపోయేది” అని నాటి ప్రముఖ హీరోయిన్, నేడు వ్యాపారవేత్తగా ఉన్న జూహిచావ్లా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ వైరల్ కంటెంట్. ఎప్పుడు రూపాయి పతనం అయినా ఇదే టాపిక్ ను నెటిజన్లను బయటకు తీస్తూంటారు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే రూపాయి రేటు డాలర్‌తో మారకానికి 90 దాటిపోయింది. వంద వైపు పరుగులు పెడుతోంది. చేతకాని ప్రభుత్వం ఇది బలం అని వాదిస్తోంది. కానీ రూపాయి బలహీనం వల్ల జరుగుతున్న నష్టాలను మాత్రం గుర్తించడం లేదు.
కాంగ్రెస్ హయాంలో రూపాయి అరవై దాటితే గర్జించిన సెలబ్రిటీలు
బుధవారం రూపాయి మొదటిసారిగా 90.13కి చేరింది, మునుపటి రోజు 89.9475 రికార్డును బద్దలుకొట్టింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, ఆయిల్ ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల రూపాయి వేగంగా పతనం అవుతోంది. 2014కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 60కి చేరినప్పుడు దేశమంతా గగ్గోలు రేగింది. బలహీన ప్రభుత్వం.. రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోతోందని మోదీ సహా అందరూ విమర్శలు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజకీయ నేతలు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడారెచ్చిపోయేవారు. ప్రభుత్వాన్ని నిందించేవారు. కానీ ఇప్పుడు ఎవరూ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు.
రూపాయి బలహీనం మంచిదేనని ఆర్థిక మంత్రి వింత వాదన
విచిత్రం ఏమిటంటే.. కాంగ్రెస్ హయాంలో.. రూపాయి పతనం ఘోరం అయితే.. ఇప్పుడు మంచిదేనని వాదించడం. రూపాయి పతనం కాకుండా గతంలో కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి బలహీనం కావడం లేదని.. డాలర్ బలోపేతం అవుతోందని..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వింత వాదనలు చేస్తున్నారు. భారత ఉత్పత్తులు విదేశీ మార్కెట్లలో చౌకగా అవుతాయి. IT, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి సెక్టర్లు డాలర్లలో ఆదాయం పొందుతూ ఉంటే రూపాయిలలో ఎక్కువ ఆదాయం కనిపిస్తుంది. కానీ నష్టాలే ఎక్కువ.
దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి
భారత్ 90 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫెర్టిలైజర్లపై ప్రభావం చూపుతుంది. RBI అంచనాల ప్రకారం, 5% డెప్రిసియేషన్ ఇన్ఫ్లేషన్ను 30-35 బేసిస్ పాయింట్లు పెంచుతుంది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతాయి. FIIలు తగ్గిపోతాయి. 2025లో FDI నెగటివ్‌గా మారిందని లెక్కలు చెబుతున్నాయి. విదేశాల్లో చదువుతున్నవారికి సంవత్సరానికి రూ. 5-10 లక్షలు ఎక్కువ భారం అవుతాయి. ఇవి మాత్రమే కాదు.. డాలర్ తో వ్యవహారాలు నడిపే ప్రతి రంగంపైనా ప్రభావం పడుతుంది. కానీ కేంద్రం ఈ ప్రభావాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోంది.
ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయరు ?
రూపాయి పతనం భారత ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా నష్టమే చేస్తుంది. ఎగుమతులుకన్నా దిగుమతలే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనది దిగుమతులపై ఆధారపడుతున్న దేశం. RBI, ప్రభుత్వం ట్రేడ్ డిఫిసిట్ తగ్గించడం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ముఖ్యం.అవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కనీసం డాలర్ విలువను తగ్గించేందుకు కొన్ని చర్యలు ఆర్బీఐ, కేంద్రం తీసుకోవాల్సి ఉంది. లేకపోతే.. జూహిచావ్లా చెప్పినట్లుగా జారిపోతూనే ఉంటుంది. లాక్కోకపోతే కిందకే పోతుంది.
