భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఘోరమైన పతనాన్ని చవిచూసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు , దేశీయ కార్పొరేట్ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2500 పాయింట్ల వరకూ పతనం చెందింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 775 నష్టపోయింది. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజే సుమారు రూ. 12 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.
గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ వనరులపై ఇరాన్ దాడి చేయడం దీనికి కారణం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రమై, ఖతార్‌లోని ప్రధాన గ్యాస్ సౌకర్యాలపై దాడులు జరగడంతో సరఫరా నిలిచిపోతుందనే భయం నెలకొంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటింది. పెరిగిన చమురు ధరలు భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్న ఆందోళన మదుపర్లను అమ్మకాలకు పరుగులు పెట్టారు.
దేశీయంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి కి పడిపోవడం మార్కెట్‌ను కుదిపేసింది. బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆకస్మిక రాజీనామా చేస్తూ.. బ్యాంక్ అంతర్గత పద్ధతులు తన నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొనడం ఇన్వెస్టర్లలో అనుమానాలను రేకెత్తించింది. నిఫ్టీలో 11 శాతానికి పైగా వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పతనం మొత్తం బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపింది. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడినప్పుడే మళ్లీస్టాక్ మార్కెట్ కు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది.
