హైదరాబాదీ సంచలనం పీవీ సింధు మళ్లీ ఓడింది. రియో ఒలింపిక్స్ తర్వాత సెలబ్రిటీగా మారిన ప్రభావం ఆమె ఆటతీరుపై స్పష్టంగా కనిపిస్తోంది. పోరాట పటిమ తగ్గిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి హైదరాబాద్ చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. డబుల్ డెక్కర్ బస్సులో విజయయాత్ర మొదలుకుని బి.డబ్ల్యు.కారు బహుమతి, షాపింగ్ మాల్స్ ప్రారంభించే సెలబ్రిటీ స్టేటస్ వరకూ అంతా కొత్తగా గడిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ముఖ్యమైన కార్యక్రమం జరిగినా ఆమెను ప్రత్యేక అతిథిగా పిలవడం ఆనవాయితీ అయింది.
ఈ హడావుడిలో పడిపోయి ప్రాక్టిస్ తగ్గించిందో మరేంటో గానీ ఆమె నిలకడగా ఆడలేకపోతోంది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ సింధు నిరాశ పరిచింది. రెండో రౌండ్ లోనే ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.
పారిస్ లో జరుగుతున్న టోర్నీలో సింధు రెండో రౌండ్ లో కొంత పోరాడినా ఓటమి తప్పలేదు. చైనా ప్రత్యర్థి హి బింగ్ జియో 22-20, 21-17 తో సింధును ఓడించింది. తొలిగేములో హోరాహోరీగా పోరాడిన సింధు, రెండో గేములో పట్టు సడలించింది. దీంతో చైనా అమ్మాయి ఎక్కువగా కష్టపడకుండానే విజయం సాధించింది.
తన కెరీర్ లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ గెలవాలని సింధు ఆశిస్తోంది. అయితే అది ఇంకా అందని ద్రాక్షే అయింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తర్వాత ఆమెలో ఆత్మ విశ్వాసం మరింత పెరగాల్సింది. కానీ తగ్గినట్టుంది.
రియో తర్వాత ఆమె ఆడిన తొలి టోర్నీ డెన్మార్క్ ఓపెన్. అందులోనూ సింధు రెండో రౌండ్ లోనే ఓటమి పాలైంది. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ తన లక్ష్యమని చెప్పిన సింధు ఆటతీరు ఇలాగే ఉంటే ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టమే.