స్టార్ హీరోల దగ్గర పర్సనల్ పీ.ఆర్.ఓగా పని చేసే అవకాశం రావడం అంత ఈజీ కాదు. అలా వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. పేరు, గుర్తింపు, డబ్బు… అన్నీ అందుతాయి. ఫ్యాన్స్‌తో మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలా.. ఓ స్టార్ హీరో దగ్గర సెటిల్ అయిపోయాడు ఓ పీ.ఆర్. మొన్నటి వరకూ నమ్మిన బంటులానే ఉన్నాడు. ఈ ప్రయాణంలో తన లైఫ్ కూడా చాలా మారింది. వ్యక్తిగతంగా తానూ సెటిలైపోయాడు. కానీ ఇప్పుడు ఏదో అయ్యింది. సడన్ గా హీరో తన టీమ్ నుంచి తీసి పక్కన పెట్టాడు. ఆ స్థానంలో కొత్త పీ.ఆర్ వచ్చి చేరాడు.
అయితే ఈ మార్పు అంత ఈజీగా జరగలేదు. పీ.ఆర్ చేసిన ఘన కార్యాలు ఒకొక్కటిగా హీరో దృష్టికి చేరాయి. సదరు హీరోకి రీ రిలీజ్‌ల క్రేజ్ ఎక్కువ. తన సినిమా రీ రిలీజ్ అయితే మంచి వసూళ్లే వస్తాయి. అయితే ఆ డబ్బుని ఛారిటీకి వాడడం అలవాటు. ఫ్యాన్స్ కూడా ‘మా హీరో ఛారిటీ చేస్తాడు’ అనుకొనే సినిమా టికెట్ ని ఎంత రేటయినా కొంటుంటారు. అలాంటిది… రీ రిలీజ్ ల పేరు చెప్పి, ఈ పీఆర్ సొమ్ము చేసుకోవడం హీరో దృష్టికి వెళ్లింది. పైగా… హీరోలకూ, ఫ్యాన్స్‌కూ వారధిలా ఉండాల్సిన వాడు… అడ్డు గోడలా తయారయ్యాడన్నది ఓ కంప్లైంట్. స్వయంగా ఫ్యాన్సే ఈ విషయాన్ని హీరో దగ్గరకు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ విషయమై హీరో కూడా హర్టయినట్టు టాక్. ఫ్యాన్స్ ని బలంగా నమ్మే హీరో ఆయన. అందుకే ఈ విషయంలో మాత్రం ఆయన ఉపేక్షించదలచుకోలేదని, అందుకే తన పీఆర్ని పక్కన పెట్టాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానుల మనోభావాలకు ఇంత విలువ ఇచ్చే హీరో ఎవరుంటారు? ఎప్పుడైతే హీరో పీఆర్ మారాడో.. అప్పుడు ఫ్యాన్స్ కూడా బాగా హ్యాపీగా ఫీలయ్యారని తెలుస్తోంది. ఇక నుంచీ ఫ్యాన్స్ కీ హీరోకీ ఎలాంటి అడ్డుగోడలు ఉండవన్న ధీమా వ్యక్తం అవుతోంది.