తమిళనాడులో వ్యక్తిపూజ ఎక్కువ. ఓ మనిషి నచ్చితే.. తమిళ ప్రజలు దేవుడ్ని చేసేస్తారు. జయలలితకు తమిళ గుండెల్లో అదే స్థానం ఉంది. తమిళ తంబీలకు ఆమె అమ్మ! సరిగ్గా అంతటి అభిమానమే రజనీకాంత్‌కీ ఉంది. రజనీ అంటే… తమిళనాట ఓ పూనకం. అయితే జయలలిత – రజనీకాంత్ మధ్య ఉన్నది స్నేహమో, వైరమో తమిళ ప్రజలు కూడా చెప్పలేని పరిస్థితి. ఓ సందర్భంలో ‘జయలలిత ఈసారీ ముఖ్యమంత్రి అయితే తమిళ ప్రజల్ని దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు రజనీ. అలాగని శత్రువు అయిపోలేదు. మరుసటి ఎన్నికల్లోనే… ‘జయలలితే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి’ అంటూ మరో స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో రజనీ – జయలలిత మధ్య గ్యాప్ తగ్గిందని చెప్పుకొన్నారు.
రజనీ – జయల మధ్య మరో ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకొంది. ఓ రోజు రజనీ కార్లో వెళ్తుంటే.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందట. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని విషయం ఏమిటని అడిగాడట రజనీ. ”అరగంటలో జయలలిత ఈ దారిన వస్తున్నారు.. అందుకే ట్రాఫిక్ నిలిపివేశాం` అని సమాధానం వినిపించిందట. జయ రావడానికి అరగంట ఉంది కదా, ఈలోగా మేం ఎందుకు ట్రాఫిక్‌లో ఉండాలి?” అని రజనీ ప్రశ్నించినా… ట్రాఫిక్ కానిస్టేబుల్ సమాధానం చెప్పలేదట. దాంతో రజనీ కార్లోంచి దిగి.. ఆ పక్కనే ఉన్న కిల్లీ కొట్టు దగ్గరకు వెళ్లి నిలబడ్డాడట. రజనీలాంటి వాడు రోడ్డుమీదకొస్తే.. మామూలుగా ఉంటుందా? ఆ దెబ్బకు జనం అంతా అక్కడే గుమ్మిగూడిపోయారు. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి గంటకు పైనే పట్టిందట. రజనీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ లో జయలలిత చిక్కుకోవాల్సివచ్చిందట. ఈ సంఘటనని ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అనే పుస్తకంలో ప్రస్తావించారు.