రియల్ఎస్టేట్ కంపెనీలు తమ బడా ప్రాజెక్టులను మార్కెటింగ్ చేసుకునేందుకు ఆకర్షణీయమైన బ్రోచర్లను చూపిస్తూంటాయి. ఇందులో లగ్జరీ ఇంటీరియర్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్లు ఆ స్థితిలో ఫ్లాట్ హ్యాండోవర్ చేస్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ బిల్డర్ ఇచ్చేది మొండిగోడలు మాత్రమే. వారు చూపించినట్లుగా అయినా… మరో విధంగా అయినా వినియోగంలోకి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఇంటీరియర్ ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సిందే.
హైరైజ్ అపార్ట్మెంట్ల ప్రకటనల్లో చూపించిన ఇంటీరియర్ డిజైన్లు సాధారణంగా మార్కెటింగ్ కోసం సిద్ధం చేసిన షో ఫ్లాట్లు లేదా శాంపుల్ ఫ్లాట్లు మాత్రమే. ఈ ఇంటీరియర్లు ఖరీదైన ఫర్నిచర్, డెకర్, ప్రొఫెషనల్ డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపించేలా రూపొందిస్తారు. అదే స్థితిలో కొనుగోలు చేసిన ఫ్లాట్ ఉండదు. ఇవ్వరు కూడా.
కొన్ని లగ్జరీ హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో, డెవలపర్లు ఇంటీరియర్ డిజైన్ ప్యాకేజీలను ఆప్షనల్‌గా అందిస్తున్నారు. అవి అదనపు ఖర్చు. ప్రకటనల్లో చూపించే షో ఫ్లాట్లు తాత్కాలికంగా సిద్ధం చేస్తారు. కొన్ని కంపెనీలు డెవలపర్ల కోసం షో ఫ్లాట్లను డిజైన్ చేస్తాయి. కానీ కొనుగోలుదారులు అదే డిజైన్‌ను పొందాలంటే వారు సొంతంగా ఖర్చు చేయాలి. చాలా హైరైజ్ అపార్ట్మెంట్లు వాల్స్, ఫ్లోరింగ్, బేసిక్ ఫిట్టింగ్స్ ను మాత్రమే అందిస్తాయి.
ఫ్లాట్ కొనుగోలుదారులు తమ సొంత ఖర్చుతో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇల్లు కొనాలనుకున్నప్పుడు.. అపార్టుమెంట్ కొనాలనుకున్నప్పుడు ఇంటీరియర్‌ను అసలు చూడవద్దు..!