ఆమ్ ఆద్మీ పార్టీ లో ఎంతో కాలంగా కీలక వ్యూహకర్తగా, అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నాయకత్వానికి, చద్దాకు మధ్య గత కొన్నాళ్లుగా ముదురుతున్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఆయనను రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించడమే కాకుండా, సభలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని పార్టీ ఏకంగా రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ఇది ఆయనను ఉద్దేశపూర్వకంగానే పార్టీ దూరం పెడుతోందన్న వాదనలకు బలం చేకూరుస్తోంది.
ఇలా ఆయనను పదవి నుంచి దింపేయడానికి, పార్టీ తరపున మాట్లాడకుండా చేయడానికి ఆయన ఆప్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీని పొగడలేదు. చాలా సామాన్యుల అంశాలపై మాట్లాడారు. వాటికి మంచి రియాక్షన్ వచ్చింది. ఆయనకు కేజ్రీవాల్ కన్నా ఎక్కువ పేరు వస్తుందని అనుకున్నారేమో కానీ.. దూరం పెట్టేశారు. రాఘవ్ చద్దా కేవలం సాఫ్ట్ పీఆర్ కే పరిమితం అవుతున్నారని, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌కు సంబంధించిన కీలక సమస్యలను ఆయన సభలో ప్రస్తావించడం లేదని సీఎం భగవంత్ మాన్ వంటి నేతలు విమర్శించారు. దీనిపై చద్దా స్పందిస్తూ.. తాను సభకు వెళ్లేది గందరగోళం సృష్టించడానికి కాదని, ప్రజా సమస్యలపై ప్రభావవంతంగా మాట్లాడటానికని గట్టిగా బదులిచ్చారు.
నన్ను నిశ్శబ్దంగా ఉంచడం అంటే ఓడించడం కాదు.. నేను గాయపడిన వ్యక్తిని, సమయం వచ్చినప్పుడు మరింత తీవ్రంగా మారతాను అంటూ ధురంధర్ డైలాగులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని కీలక నేతలైన అతిశీ, సౌరభ్ భరద్వాజ్ వంటి వారు చద్దా తీరును తప్పుపడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో లండన్‌లో ఉండి పార్టీకి అండగా నిలవలేదని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ నుంచి ఎదురవుతున్న ఈ వరుస దాడులు, ఆయనకు పార్లమెంట్లో గొంతు వినిపించే అవకాశం లేకుండా చేయడం వంటి పరిణామాలు ఆయనను బీజేపీ వైపు నడిపిస్తున్నాయనే చర్చ జాతీయ మీడియాలో జోరుగా సాగుతోంది.
రాఘవ్ చద్దా ఇప్పటికీ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి లో సభ్యుడిగా ఉన్నప్పటికీ, ప్రాధాన్యత పరంగా ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్‌కు కుడిభుజంలా ఉన్న నేతను ఇలా టార్గెట్ చేయడం వెనుక పార్టీ అంతర్గత కుట్ర ఉందా? లేక నిజంగానే ఆయన బీజేపీకి దగ్గరయ్యారా? అన్నది తేలాల్సి ఉంది.
