ప్లానింగ్ కమీషన్ ఆవిర్భావం, అంతర్ధానాల వెనుక అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం వుంది. ఏదో ఒక అగ్రరాజ్యం పాలననుంచి స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందిన దేశాలన్నిటిమీదా ఎంతోకొంత సోవియెట్ రష్యా ప్రభావం వుండేది. ఫెడరల్ స్వభావంతో రాషా్ట్రల అవసరాలను, మొత్తం వనరులను క్రోడీకరించి దశలవారీ అభివృద్ధికోసం ప్రణాళికలు రూపొందించుకునే శ్రేయో లేదా సంక్షేమ రాజ్యం కాన్సెప్టు నెహ్రూ ప్రధానిగా వున్నపుడు పంచవర్ష ప్రణాళికలుగా ప్రపంచాన్ని ఆకర్షించింది. రకారకార పేర్లతో అనేక చిన్నదేశాలు ఈ పద్దతినే అనుసరించాయి. ప్రణాళికా బద్ధంగా నిధులు కేటాయించే భారత ప్లానింగ్ కమీషన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖపై సూపర్ పవర్ గా చెలామణి అయ్యింది. మన్మోహన్ సింగ్ హయాంలో లోనే ప్లానింగ్ కమీషన్ ప్రతిపత్తి, గౌరవాలు క్షీణించడం మొదలయ్యాయి.
వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని 46 సంవత్సరాల క్రితం ఫైనాన్స్ కమీషన్ ప్రతిపాదించింది. వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక సహాయం, పన్ను మినహాయింపులు కల్పించటానికి ప్రత్యేక హోదా కల్పించాలని 5వ ఫైనాన్స్ కమీషన్ 1969లో సిఫార్సు చేసింది. ఆర్థికంగా, మౌలికవసతుల పరంగా వెనుకబడి వుండడం, తగినస్థాయిలో ఆర్థిక వనరులు లేకపోవడం, కొండప్రాంతాలు, క్లిష్టతరమైన భూభాగాలు, గణనీయమైన సంఖ్యలో గిరిజనులు వుండటం, పొరుగుదేశాలతో వ్యూహాత్మక హద్దులు కల్గి వుండటం వంటి అంశాలను రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి ప్రాతిపదికగా తీసుకుంటారు. . ఆమేరకు ఇప్పటివరకు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా సౌకర్యాలను అనుభవిస్తు న్నాయి. మొదట్లో నాగాలాండ్, అసోం, జమ్మూ కాశ్మీర్లకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచలప్రదేశ్, హిమాచల ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు విస్తరించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే అధికారం ప్రధానమంత్రి అధ్యక్షతన వుండే జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)కి వుంటుంది. ఎన్‌డీసీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు, కేంద్ర మంత్రులు వుంటారు.
ఫైనాన్స్ కమీషన్ కేంద్ర నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తుంది. కేంద్ర సాధారణ సహాయం, కేంద్ర అదనపు సహాయం, ప్రత్యేక కేంద్ర సహాయం అంశాలు ఇందులో వుంటాయి. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఎక్కువగా సహాయం అందించేందుకు వీలుగా మొత్తం సహాయంలో 30శాతాన్ని వాటికి కేటాయించి మిగతా 70శాతాన్ని మిగిలిన రాష్ట్రా లకు పంపిణీ చేస్తారు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్రం సహాయాన్ని అందజేస్తుంది.
1969లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా వున్న డాక్టర్ వి.ఆర్.గాడ్గిల్ రూపొందించిన ఫార్ములాను 1990లో సవరించారు. 1990లో ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షులుగా వున్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరు వచ్చేలా గాడ్గిల్-ముఖర్జీ పేరు పెట్టారు. ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులుంటాయి. ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో రాయితీ వుంటుంది. పన్ను రాయితీలు ఎక్కువగా లభిస్తాయి. ఎక్సైజ్ సుంకంలో మినహాయింపు లభిస్తుంది ఇందువల్ల ఎక్కువగా పరిశ్రమలు స్థాపించే అవకాశం వుంటుంది. దీంతో ఆ రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు, కేంద్రం నుంచి పెద్దమొత్తంలో నిధులు వస్తాయి.
బడ్జెట్‌పరంగా పెద్దగా ఆంక్షలేవీ వుండవు కాబట్టి రుణ మార్పిడి, రుణ మాఫీ పథకాలు వర్తింపజేసుకోవడం ద్వారా అప్పులపై వడ్డీ తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ 2014లో ప్రకటన చేసినప్పుడు 12వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాలేదు. ఈలోగా ప్రభుత్వాలు మారిపోయాయి. ఆతరువాత 12వ ఆర్థిక సంఘం రాష్ట్రాల ప్రత్యేక హోదా రద్దుచేయాలని సిఫార్సు చేసింది. రాష్ట్రా లు, వాటికి కావాల్సిన రుణాలను స్వయంగా సమకూర్చుకోవాలని సూచించింది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకిస్తున్న 90 శాతం గ్రాంటులు, 10 శాతం రుణాన్ని ఇక మీదట కేంద్ర సంక్షేమ పథకాలకు పరిమితం చేయాలని ఆర్థిక సంఘం సూచించింది.
మార్కెట్ లో పోటీ ద్వారానే అభివృద్ధి సాధ్యమనే సరళీకృత ఆర్ధిక విధానాలు సబ్సిడీల సంక్షేమాన్ని ఆమోదించవు గనుక ‘లిబరలైజేషన్’ ప్రపంచాన్ని ఆక్రమించడం మొదలయ్యాక భారత ప్లానింగ్ కమీషన్ వెలవెలబోవడం మొదలైంది. కమీషన్ వైస్ చైర్మన్ గా ప్రపంచబ్యాంక్ సీనియర్ అధికారికా పని చేసిన నిపుణుణ్ణి మన్మోహన్ రెండోసారి ప్రధాని అయ్యాక నియమించారు. దీంతో ప్లానింగ్ కమీషన్ నామమాత్రమైపోయింది. లిబరలైజేషన్ వేగంచాలదన్న ప్రపంచ ఆర్ధిక రంగాన్ని సైద్ధాంతికంగా సమర్ధించే నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక నామమాత్రపు ప్లానింగ్ కమీషన్ ను కూడా రద్దుచేసేశారు. ప్రధానమంత్రి అధ్యక్షుడుగా నీతిఆయోగ్ ను నెలకొల్పారు. ఫలితంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆచరణలో సర్వ స్వతంత్రతను సంతరించుకుంది. సహాయాల, సబ్బిడీల తలనొప్పులులేకుండా లిబరలైజ్డ్ విధానాలు సూటిగా నేరుగా అమలు చేయడానికి వీలుగానే ప్లానింగ్ కమీషన్ ను రద్దు చేశారని అన్ని పరిణామాలనూ విశ్లేషిస్తే ఎవరికైనా అర్ధమౌతుంది.
ఇదంతా తెలిసివున్న ప్రధాని మన్మోహన్ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా మొదట ప్రత్యేక హోదాను గురించి ప్రస్తావించనేలేదు. బిజెపికి రాజకీయలబ్దితీసుకరావడానికి వెంకయ్యనాయుడు పట్టుబట్టడంతో ఐదేళ్ళ ప్రత్యేక హోదా ఇవ్వగలమని ప్రధాని ప్రకటించక తప్పలేదు. అయితే దాన్ని చట్టంలో పొందుపరచకపోవడం గమనార్హం. ఐదేళ్ళుకాదు పదేళ్ళు అని ఊగిపోయిన వెంకయ్యనాయుడు తన పార్టీ పబ్బంగడిపేశారు.
సంపూర్ణమెజారిటీతో ప్రధాని అయిన మోదీ వేగంగా పూర్తిచేస్తున్న సంస్కరణల్లో భాగంగానే ప్లానింగ్ కమీషన్ ను కూల్చేశారు. నీతిఆయోగ్ ని ప్రత్యామ్నాయంగా చూపించారు. నిజానికి ఈ మార్పువల్ల అన్ని రాషా్ట్రలూ కేంద్రఆర్ధిక మంత్రిత్వశాఖ ముందు చేతులు సాచవలసిన పరిస్ధితి ఏర్పడింది.
ఇది తెలుగుదేశం, బిజెపి పార్టీల్లో అగ్రనాయకులందరికీ తెలుసు. అయినా ప్రజల్లో వున్న సెంటిమెంటువల్ల , ఓట్లకు దూరం కాకూడదన్న తాపత్రయం వల్లా ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకోడానికి ”ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా”నినాదాన్ని అడ్డంగా వాడేసుకుంటున్నారు.
ఇదెలా వుందంటే నష్టపోయిన పార్టీకి పరిహారంగా ”ప్లిమ్మత్ కారు ఇస్తామని ఒక సెటిల్మెంటులో పెద్దమనిషి చెప్పాడు. కొద్దిరోజులకే ప్లిమ్మత్ కంపెనీ మూతపడింది. ఇస్తానన్న కారు ఇవ్వాలని ఆపార్టీ గొడవపెడుతోంది. కంపెనీ మూతపడిన విషయాన్ని ప్రస్తావించకుండా ఇంకాపెద్ద కారు వస్తుంది వుండు అని పెద్దమనిషి జోలపాడుతున్నాడు. ఆపెద్దకారేంటో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఇస్తారో పెద్దమనిషీ తేల్చడంలేదు. ప్లిమ్మత్ కోసం గొడవా ఆగడంలేదు.
బీహార్ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యత నిలబడితే ప్రత్యేక హోదా కోసం గొడవపడి లాభంలేదు ఇచ్చేదానితో సర్దుకోండి అని కేంద్రం నిర్మహమాటంగా తేల్చేస్తుంది. బీహార్ లో బిజెపి దెబ్బతింటే ”ఎలాగైనా సరే ఇచ్చినమాట నిలబెట్టుకోకతప్పదు లేకపోతే దెబ్బతినేస్తాం” అని తెలుగుదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ బిజెపి కూడా మోదీపై గట్టిగానే వత్తిడి పెంచే వీలుకుదురుతుంది.