హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మరింత విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్టు కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ, అత్యుత్తమ డిజైన్లను ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ ఫ్యూచర్ సిటీ కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ ఎకో-సిస్టమ్ గా అవతరించనుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌లో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ , నెట్-జీరో ఎమిషన్ జోన్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లు రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. రవాణా వ్యవస్థ, మురుగునీటి పారుదల, గ్రీన్ బెల్టులు , వాణిజ్య సముదాయాల నమూనాలను సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ , మెట్రో రైలు కనెక్టివిటీని ఈ ప్లాన్‌లో అంతర్భాగం చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ , జోనింగ్ ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడెక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగాలనే దానిపై కన్సల్టెంట్లు శాస్త్రీయ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, సహజ వనరులను కాపాడుతూనే పారిశ్రామిక వృద్ధిని సాధించేలా ఈ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారు. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ మాస్టర్ ప్లాన్, హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
రాబోయే కొద్ది నెలల్లోనే ఈ మాస్టర్ ప్లాన్ తుది రూపు దాల్చనుండటంతో, ఫ్యూచర్ సిటీ పరిధిలోని భూముల ధరలకు అప్పుడే రెక్కలు వచ్చాయి. ముచ్చర్ల, ఆమనగల్ , మహేశ్వరం వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ కన్సల్టెంట్లు ఇచ్చే నివేదిక ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చించనుంది.


