సెంచరీ సినిమాల నటుడు శ్రీకాంత్. చిన్న స్థాయి నుంచి స్టార్ గా మారాడు. కెరీర్‌లో అన్ని రకాల పాత్రలూ చేశాడు. హీరోగా ఎక్కువ విజయాలు చవి చూశాడు. హీరో గా తన ఇన్నింగ్స్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. అలాంటి క్లిష్టమైన తరుణంలో ప్రతినాయకుడిగా మారాడు. `అఖండ`లో బాలయ్యని ఢీ కొట్టేది శ్రీకాంతే. విలన్ పాత్రలు తనకేం కొత్తకాదు.కానీ ఈ ఇన్నింగ్స్‌లో కొత్తే. లెజెండ్ తరవాత… జగపతిబాబు కెరీర్ ఎలా మారిపోయిందో, అఖండ తరవాత శ్రీకాంత్ కెరీర్ అలా మారుతుందని ఇండ్రస్ట్రీ నమ్ముతోంది. మరి ఈ పాత్ర గురించి..శ్రీకాంత్ ఏమంటున్నాడు? తన ఫ్యూచర్ ప్లాన్లేంటి..? ఇవన్నీ తెలుసుకునేందుకు శ్రీకాంత్ తో చిట్ చాట్ చేస్తే..
* విలన్ గా ఈ ఇన్నింగ్స్ ఎలా ఉంది?
– నేను అక్కడి నుంచే వచ్చాను.. కెరీర్ ప్రారంభంలో విలన్ గా చేశాను. యుద్ధం శరణంలో మళ్లీ ప్రతినాయకుడిగా కనిపించను. కాకపోతే.. ఏ సినిమా పడితే, ఆసినిమా చేయకూడదు… అని గట్టిగా డిసైడ్ అయ్యాను. అలాంటి టైమ్ లోనే. బోయపాటి నాకు ఈ కథ చెప్పారు. కథ విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అనిపించింది. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనిపించింది.
* బాలయ్యతో ప్రయాణం ఎలా అనిపించింది?
– ఆయనతో శ్రీరామారాజ్యం సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి గా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన సినిమా కూడా బాగా వస్తుందంటూ బోయపాటి గారికి చెబుతూ ఉండేవారు. దానికి తగ్గట్టుగా నా పాత్రని డిజైన్ చేశారు. బాలయ్యతో ఎప్పటి నుంచో.. అనుబంధం ఉంది. సీసీఎల్ సమయంలో క్రికెట్ ఆడాం. అప్పటి నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది. `ఈ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతాను` అని బాలకృష్ణ అనేవారు.
* లెజెండ్ తరవాత జగపతి బాబు కెరీర్ టర్న్ అయ్యింది. అలా మీ ప్రయాణం కూడా ఈ సినిమాతో మారుతుందని అనుకుంటున్నారా?
– లెజెండ్ సినిమా జగపతి బాబుకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు. ఇప్పటికీ మంచి స్థానంలో ఉన్నారు. నాకూ అలా ఉంటుందని నేను అనుకోను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. ఓ పక్కన హీరోగా, విలన్‌గా నటిస్తున్నాను ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలోనూ పాత్రను పోషిస్తున్నాను. మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను.
* మీ నటనలో మీకు కనిపించిన మార్పేంటి?
– ఈ చిత్రంలో నాది సెటిల్డ్ పర్ఫామెన్స్‌లా ఉంటుంది. తెగ అరిచుకునేలా ఉండదు. డబ్బింగ్‌లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. సెటిల్డ్‌గా డైలాగ్స్ చెప్పించారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య గారి దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇది హెవీ హై ఓల్టేజ్ సినిమా. నేచర్‌తో ఎలా ఉండాలి.. ఎలా పోరాడాలనే విషయాలుంటాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా పాత్రను చూసి జనాలు ఏమంటారు? తిడతారా? అని చూస్తున్నాను.
* హీరోగా బాగుందా? ఇప్పుడు విలన్ గా?
– నాకు హీరోగా చేయడమే ఇష్టం. కానీ పాత్రలు నచ్చితే కారెక్టర్‌లు కూడా చేశాను. అది నాకొక సరదా. హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను. లైఫ్‌ను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి.
* ఇప్పుడు ఓటీటీ విజృంభిస్తోంది. ఈ ట్రెండ్ ఎలా ఉంది?
– థియేటర్లో చూసే ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓటీటీలో అయితే ఇంట్లో ఒకరిద్దరం కూర్చుని చూస్తాం. కానీ ఇలాంటి సినిమాను అందరి మధ్య కూర్చుని చూస్తూ విజిల్స్ వేస్తూ చూడాలి. అప్పుడే మజా ఉంటుంది.
* చేతిలో ఉన్న సినిమాలేంటి?
– పునీత్ రాజ్ కుమార్‌తో ఓ సినిమాలో విలన్‌గా నటించాను. శంకర్ రామ్ చరణ్ సినిమాలో ఓ పాత్రను చేస్తున్నాను. వివరాలు ఇప్పుడే చెప్పొద్దని అన్నారు.