ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాను పాటించక ఒక అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని కోల్పోయామని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ వేదికగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఆయన, నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. రాయదుర్గం ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టాలని నాడు చంద్రబాబు సూచించినా, భవిష్యత్తును అంచనా వేయడంలో విఫలమై ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నామని ఆయన నిజాయితీగా అంగీకరించారు.
నాడు సైబరాబాద్ విషయంలో చేసిన పొరపాటును, నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో పునరావృతం కానివ్వనని రాజీవ్ సింగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు దార్శనికతతో హైదరాబాద్‌లోని రాయదుర్గం నేడు ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా ఎదిగిందని, అప్పట్లో అక్కడ పెట్టుబడి పెట్టి ఉంటే నేడు డీఎల్ఎఫ్ స్థాయి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే స్వయంగా అమరావతిని సందర్శించి అక్కడ ఉన్న పెట్టుబడి అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రికి వెల్లడించారు.
ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. కేవలం అమరావతి మాత్రమే కాకుండా, విశాఖపట్నం అభివృద్ధిలో కూడా డీఎల్ఎఫ్ భాగస్వామ్యం కావాలని ఆయన ఆహ్వానించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ఈ రెండు నగరాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన పారిశ్రామిక, హౌసింగ్ పాలసీల గురించి వివరిస్తూ, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను ఆయన వివరించారు.
దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన డీఎల్ఎఫ్ అధినేత స్వయంగా అమరావతిపై ఆసక్తి చూపడం ఇప్పుడు ఏపీ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో చంద్రబాబు విజన్‌ను నమ్మి పెట్టుబడులు పెట్టిన వారు నేడు కోటీశ్వరులయ్యారని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే రిపీట్ కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజీవ్ సింగ్ వ్యాఖ్యలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి పెంచడమే కాకుండా, ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఏపీ వైపు చూసేలా చేస్తాయనడంలో సందేహం లేదు.
