ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఓ వైపు భారత్ యుద్ధం చేస్తూంటే మరో వైపు క్రికెట్ ఆడటం మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిస్థితులు కుదుటపడగానే మళ్లీ నిర్వహిస్తారు. రద్దు మాత్రం చేయలేదు. ఇంకా పన్నెండు లీగ్ మ్యాచ్‌లతో పాటు, కాలిఫైయర్స్, ఎలిమినేటర్, ఫైనల్స్ ఉన్నాయి. దక్షిణ భారత్ తో పాటు మరికొన్ని సురక్షిత ప్రదేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించవచ్చు. కానీ వాయిదాకే బీసీసీఐ మొగ్గు చూపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచులు జరిగినా ఎవరూ పట్టించుకునే అవకాశం ఉండదు.
గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన నిర్వాకం కారణంగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ ను రద్దు చేశారు. ఆ తర్వాత ఐపీఎల్ కొనసాగించరని ఈ సీజన్ వరకూ రద్దు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే రద్దు చేస్తే ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. చివరికి వచ్చినందున పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత నిర్వహించడమే మేలని నిర్ణయానికి వచ్చారు.
క్రికెటర్లు అందరూ ఇప్పటికే ఎవరి దారిన వాళ్లు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో వైపు పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కూడా ఇప్పుడే జరుగుతోంది. రావుల్పిండి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత్ డ్రోన్ ఎటాక్ చేయడంతో మ్యాచ్ నిలిపివేసి పంపించి వేశారు. అక్కడ పూర్తిగా గందరగోళంగా ఉండటంతో పీసీఎల్ కూడా ఆపేశారు.