మొన్నటి వరకూ టీ20 ఫీవర్ తో క్రికెట్ ప్రపంచం ఊగిపోయింది. దాదాపు నెల రోజుల పాటు టీ20 మ్యాచ్లను ఆస్వాదించారు క్రీడాభిమానులు. భారత్ కప్పు గెలవడంతో ఆ సంబరం రెట్టింపయ్యింది. వరల్డ్ కప్ ఇలా ముగిసిందో… లేదో.. ఇప్పుడు మరో సంరంభం మొదలు కాబోతోంది. టీ20 లీగ్ లో అగ్రగామిగా నిలిచిన ఐపీఎల్ సంగ్రామం ఈనెలలోనే మొదలు కాబోతోంది. ఈనెల 28 నుంచి ఐపీఎల్ షురూ అవుతోంది. ఈ టోర్నీలో 10 జట్టు తలపడబోతున్నాయి. మొత్తం 84 మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు – డక్కన్ ఛార్జర్స్ తలపడబోతున్నాయి. బెంగళూరులో ఈ మ్యాచ్ జరగబోతోంది. మే 31న గ్రాండ్ ఫినాలే తో… ఐపీఎల్ ముగుస్తుంది.
గత ఐపీఎల్ లో బెంగళూరు విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్ లో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బెంగళూరు బరిలో దిగబోతోంది. ఎప్పటిలా ముంబై, చెన్నై, కొలకొత్తా, రాజస్థాన్ రాయల్స్ నుంచి మిగిలిన జట్లకు గట్టి పోటీ ఎదురు కానుంది. ఈమధ్యే పొట్టి వరల్డ్ కప్ ముగియడంతో.. ఆటగాళ్లంతా టీ 20 జోష్ లోనే ఉండే అవకాశం దక్కింది. ప్రాక్టీస్ కి పెద్దగా సమయం లేకపోయినా ఇబ్బంది లేకుండా పోయింది. టీ 20 ఆటగాళ్లంతా కొంత విరామం తీసుకొని మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టబోతున్నారు. టీ 20 ఫార్మెట్ కు దూరమైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ, జడేజా లాంటి దిగ్గజాల ఆటని మళ్లీ ఐపీఎల్ లో మాత్రమే చూడగలం. అందుకే ఈ లీగ్ కి అంత క్రేజ్.
ఐపీఎల్ మొదలు కాబోతుండడంతో సినిమా పరిశ్రమ కాస్త కంగారు పడుతోంది. ఈ వేసవిలో పెద్ద సినిమాల హడావుడి కనిపించబోతోంది. వాటి వసూళ్లకు ఐపీఎల్ గండి కొట్టే ప్రమాదం ఉంది. చాలా ఏళ్లుగా వేసవిలో వచ్చే సినిమాల ఆదాయం ఐపీఎల్ హంగామా వల్ల తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలపై ఈ ఇబ్బంది ఉంది. ఈసారి కూడా ఐపీఎల్ తో వసూళ్లు తగ్గుతాయన్న కంగారు చిత్రసీమకు ఉంది. మరి అది ఏ స్థాయిలో అనేది కాలమే నిర్ణయిస్తుంది.