ఐపీఎస్ అధికారి సంజయ్ ఇంకా జైల్లోనే ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన కొంత మందికి బెయిల్స్ వచ్చాయి కానీ ఓ మాదిరి అవినీతి కేసులో అరెస్టు అయిన సంజయ్‌కు మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. అయినా రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన కోసం జగన్ రెడ్డి అండ్ కంపెనీ పెద్దగా పట్టించుకోవడంలేదు. చాలా మంది జైల్లో ఉన్నారు నువ్వు కూడా ఉండు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతకు మించి ఆయన పార్టనర్‌గా వ్యవహరించిన లాయర్ పొన్నవోలు కూడా పట్టించుకోవడంలేదు.
ఐపీఎస్ అధికారిగా ఉంటూ సంజయ్.. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు లెక్కే లేదు. మార్గదర్శి పై లేని కేసులను పెట్టి అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును వేధించారు. విచారణ పేరుతో ఆయన వీడియోలు తీసి లీక్ చేశారు. తమ బాసులు పైశాచిక ఆనందం పొందేందుకు కావాల్సింత చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబునూ వదిలి పెట్టలేదు. తప్పుడు కేసులు పెట్టి వాటి గురించి కోర్టుల్లో చెప్పడానికి ఏమీ ఉండదని దేశమంతా తిరిగి ప్రెస్మీట్లు పెట్టారు. ఆ ప్రెస్మీట్లలో సంజయ్‌తో పాటు పొన్నవోలు ఉండేవారు.
ఇద్దరూ కలిసి అడ్డదిడ్డంగా అధికార దుర్వినియోగం చేశారు. పొన్నవోలు కూడా అప్పట్లో బాధ్యతాయుతమైన ఏఏజీ పోస్టులో ఉన్నారు. ఆయనకూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ఇద్దరూ చట్టాలను ఉల్లంఘించారు. అయినా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అలాంటి కేసుల్లో చర్యలు తీసుకుంటే.. బాగుండదని ఊరుకున్నారు. అందుకే వారు బయటపడ్డారు. కానీ ఇతర అవినీతి కేసుల్లో మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. సాధారణంగా పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ వస్తుంది. కానీ వైసీపీ లాయర్లు.. పొన్నవోలు కూడా పట్టించుకోకపోవడంతో ఆయన జైల్లో మగ్గాల్సి వస్తోంది.