ఇరాన్లో ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కుతున్నారు. కనీస అవసరాల కోసం అల్లాడిపోతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. భౌగోళికంగా ఇరాన్ అపారమైన సహజ వనరులు కలిగిన దేశం. ప్రపంచంలోనే అత్యధిక చమురు , సహజ వాయువు నిక్షేపాలు కలిగిన దేశాల్లో ఇది ఒకటి. ఈ లెక్కన ఇరాన్ ఒక ధనిక దేశం కావాలి. కానీ,కానీ అక్కడి పాలకుల ఉగ్రవాద బుద్ది కారణంగా ఆ దేశ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
ఆదాయాన్ని ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్న ఇరాన్ ప్రభుత్వం
ఇరాన్ ప్రజలు రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు , నిరంకుశ పాలన. ప్రభుత్వ ఆదాయాన్ని సొంత దేశ అభివృద్ధికి వాడకుండా, పక్క దేశాల్లో ఉన్న సాయుధ గ్రూపులకు ఇస్తున్నారు. హమాస్, హిజ్బుల్లా వంటివి ఇరాన్ ఇచ్చే నిధుల మీదనే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ అంశంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బును మాకే ఖర్చు చేయండి అని వారు నినదిస్తున్నారు. దీనికి తోడు యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మహిళలపై కఠినమైన ఆంక్షలు వంటివి ప్రజల అసహనాన్ని పెంచి, వారిని నిరసనల వైపు నడిపించాయి.
నోట్ల కట్టలున్నాయ్ ..కానీ విలువేది ?
ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్న మద్దతు కారణంగా దశాబ్దాలుగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఆ దేశం తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించలేకపోతోంది. దీనివల్ల దేశానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. మరోవైపు, దేశీయంగా ఉన్న అవినీతి, పాలకుల తప్పుడు ఆర్థిక నిర్ణయాల వల్ల ఆ సంపద సామాన్య ప్రజలకు అందడం లేదు. ఇరాన్ కరెన్సీ అయిన ‘రియాల్’ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ ఇరాన్ రియాల్స్‌లో లక్షల్లోకి చేరుకుంది. ప్రభుత్వం విపరీతంగా కొత్త నోట్లను ముద్రించడం, విదేశీ పెట్టుబడులు రాకపోవడంతో ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పింది. దీనివల్ల సామాన్యుడికి కనీసం బ్రెడ్, పాలు, మందులు కొనుక్కోవడానికి కూడా వేల సంఖ్యలో రియాల్స్ ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రజల వద్ద డబ్బు ఉన్నా, దాని విలువ లేకపోవడంతో వారు నిరుపేదలుగా మారుతున్నారు.
ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు !
ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న యుద్ధ వాతావరణం ఇరాన్ పరిస్థితిని మరింత దిగజార్చింది. యుద్ధ భయంతో విదేశీ కంపెనీలు వెనక్కి వెళ్లడం, అంతర్జాతీయ ఆంక్షలు మరింత కఠినతరం కావడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సామాన్యులకు తినడానికి తిండి, ఉండటానికి నీడ కరువైనప్పుడు వారు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు. టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లో వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు, ఇది దేశంలో ఒక పెద్ద రాజకీయ మార్పుకు సంకేతంగా మారుతోంది. ఇరాన్ పాలకులూ పారిపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
