ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే, హాలీవుడ్ దర్శకులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఖొమైనీ వంటి అగ్రనేతలను ఎలా మట్టుబెట్టారనేది అమెరికా సి.ఐ.ఏ ,దా ఇజ్రాయెల్ మొసాద్ అత్యున్నత అధికారులకే తెలిసిన టాప్ సీక్రెట్ . కానీ, మన సోషల్ మీడియా రచయితలు మాత్రం వెబ్ సిరీస్‌లను చూసి, తమ ఊహాశక్తికి పదును పెట్టి అద్భుతమైన కథలు అల్లేస్తున్నారు. ఇరాన్ కమాండర్ల శరీరాల్లోకి అదృశ్య చిప్పులు పెట్టారని, వారి పళ్లలోకి సెన్సార్లు జొప్పించారని, చివరికి వారు తినే ఆహారంలో కూడా ట్రాకర్లు ఉన్నాయంటూ పచ్చి అబద్ధాలను టెక్నాలజీ ‘ ముసుగులో వడ్డిస్తున్నారు. ఇదంతా చదివే వారికి సోషల్ మీడియా పిచ్చివాళ్ల లోకమేమో అని అనుమానపడకుండా ఉండలేరు.
ఎన్నెన్నో వెబ్ సీరిస్ ఐడియా
ఆపరేషన్ ఖొమైనీ కంప్లీట్ చేయడానికి ఇజ్రాయెల్ ఏజెంట్లు ఇరాన్ రాజధానిలోని ట్రాఫిక్ లైట్లను హ్యాక్ చేశారని, సీసీ కెమెరాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ పూర్తి చేశారని చెబుతున్న మాటలు వినడానికి ఉత్కంఠభరితంగా ఉన్నా, వాస్తవానికి వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. స్పై థ్రిల్లర్ సినిమాల్లోని సీన్లను కాపీ కొట్టి, వాటిని నిజమైన యుద్ధ తంత్రాలుగా చిత్రీకరిస్తూ సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిఘా వర్గాల రహస్య ఆపరేషన్లు ఇంత సినిమాటిక్ గా ఉండవనే కనీస జ్ఞానం లేకుండా, కేవలం వ్యూస్ , లైకుల కోసం ఈ డిజిటల్ క్రియేటర్లు సామాజిక మాధ్యమాలను ఒక పిచ్చివాళ్ల లోకంగా మారుస్తున్నారు.
వీడియో గేముల్లోని వీడియోలతో ప్రచారం
వీడియో గేముల్లోని యుద్ధ సన్నివేశాలను తీసి, అవి ఇప్పుడే జరుగుతున్న ప్రత్యక్ష దాడులంటూ ప్రచారం చేస్తున్నారు. కాల్ ఆఫ్ డ్యూటీ, మెడల్ ఆఫ్ ఆనర్ వంటి హై-గ్రాఫిక్స్ గేమ్ వీడియోలను అప్లోడ్ చేసి, క్షిపణి దాడులంటూ నమ్మిస్తున్నారు. ఈ కృత్రిమ యుద్ధ వాతావరణం వల్ల సామాన్యుల్లో అనవసరమైన భయాందోళనలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి ఒక్కరూ తామే ఒక ఇంటర్నేషనల్ డిఫెన్స్ అనలిస్ట్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తూ, గూగుల్ సమాచారాన్ని సొంత ఊహలతో కలిపి ఒక విషపూరితమైన మిశ్రమాన్ని ప్రజలపైకి వదులుతున్నారు.
యుద్ధం అంత కామెడీ కాదు !
నిజానికి యుద్ధం అనేది చావుబతుకులతో కూడుకున్న అత్యంత గంభీరమైన అంశం. దానిని ఒక ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్‌లా మార్చి, కట్టుకథలతో రక్తి కట్టించడం బాధ్యతారాహిత్యం. ఇజ్రాయెల్ లేదా ఇరాన్ వ్యూహాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఈ చిప్పులు, సెన్సార్లు, హ్యాకింగ్ కథలు మాత్రం కేవలం మాయాజాలమే. ఇలాంటి స్పై థ్రిల్లర్ కథలకు దూరంగా ఉండి, వాస్తవాలను గుర్తించకపోతే.. సమాజం మొత్తం ఒక డిజిటల్ భ్రమలో బతకాల్సి వస్తుంది.
