గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, అరబ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం యుద్ధ మేఘాలుగా మారాయి.ఇరాన్ నిరంతరంగా అరబ్ దేశాల ఆర్థిక మూలాలపై, ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు ,రవాణా మార్గాలపై దాడులు చేస్తుండటంతో, గల్ఫ్ దేశాలు తమ సహనానికి స్వస్తి పలికి ఎదురుదాడికి సిద్ధమయ్యాయి.
పిచ్చిపట్టినట్లుగా చమురు సంపదపై ఇరాన్ దాడులు
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇరాన్ కావాలనే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రవాణా నిలిచిపోయింది. గత వారం రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 39 శాతం పెరిగి, బ్యారెల్కు 110 డాలర్ల పైకి చేరింది. సౌదీ అరేబియా మా సహనం అనంతం కాదు, మా ఆర్థిక వనరులపై దాడులు జరిగితే సైనిక చర్యకు సిద్ధం అని ప్రకటించడం గల్ఫ్ దేశాల ఉమ్మడి వ్యూహానికి నిదర్శనం.
ఉమ్మడి సైనిక చర్య.. ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ?
ఒకవేళ సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు అమెరికా , ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్ పై మూకుమ్మడి దాడి చేస్తే.. అది ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ అవుతుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లే లక్ష్యంగా ఈ దాడులు ఉండవచ్చు. అయితే, ఇరాన్ తన వద్ద ఉన్న భారీ క్షిపణి నిల్వలు , డ్రోన్లతో గల్ఫ్ దేశాలలోని విమానాశ్రయాలు, హోటళ్లు, డీశాలినేషన్ ప్లాంట్లపై దాడి చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే యూఏఈ వైపు వచ్చిన దాదాపు 1700 డ్రోన్లను అక్కడి రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం
ఈ యుద్ధం కేవలం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాదు. అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే గల్ఫ్ దేశాల జీడీపీ 5 నుండి 14 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. దుబాయ్, దోహా వంటి పర్యాటక , వ్యాపార కేంద్రాలకు వెళ్లేందుకు పెట్టుబడిదారులు వెనుకాడవచ్చు. ఫలితంగా గల్ఫ్ దేశాల ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆహార , ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో గ్యాస్ ధరలు 24 శాతం పెరిగాయి.
దౌత్యం వైపు మళ్ళుతారా?
ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఇరాన్ దాడులను ఖండిస్తూ తీర్మానం చేసినా, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఒకవైపు ఇరాన్ తన అంతర్గత తిరుగుబాట్లు , అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల బలహీనపడగా, మరోవైపు అరబ్ దేశాలు తమ మనుగడ కోసం ఎదురుదాడికి సిద్ధమవుతున్నాయి. ఈ పోరు గనుక మొదలైతే, అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దౌత్యపరమైన చర్చలు జరగకపోతే, 2026 సంవత్సరం ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన ఆర్థిక మాంద్యానికి సాక్షిగా నిలవవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


