ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని భీకరమైన డైలాగులు చెప్పి అణుదాడికి సిద్ధం కావాలన్నట్లుగా బెదిరించిన ట్రంప్ చివరికి పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడి ఇరాన్ కు మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఇరాన్‌లోని కీలకమైన విద్యుత్ కేంద్రాలు , వంతెనలు , ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పూర్తిస్థాయి విధ్వంసం చేస్తామంటూ ట్రంప్ చేసిన హడావుడితో అంతర్జాతీయంగా హైఅలర్ట్ ఏర్పడింది. అయితే చివరి క్షణంలో రెండు వారాల పాటు వాయిదా వేశారు.
హార్మూజ్ ను ఇరాన్ వదిలేస్తే యుద్ధం ముగిసినట్లే
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను వదిలేయాలని.. ఎలాంటి ఆంక్షలు, డబ్బులు వసూలు చేయకూడదని ట్రంప్ అంటున్నారు. కానీ ఇరాన్ అంగీకరించడం లేదు. హర్మూజ్ గుండా రవాణాను అడ్డుకుంటే ఇరాన్ నాగరికతనే అంతం చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన పవర్ ప్లాంట్ల వద్ద లక్షలాది మంది యువతతో మానవహారాలు ఏర్పాటు చేయడమే కాకుండా, తాము కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. వరి నిమిషంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం ఇక్కడ కీలక మలుపు తిప్పింది. రెండు వారాల పాటు యుద్ధాన్ని వాయిదా వేయాలని, ఈ గడువులోగా చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని ఆయన చేసిన విన్నపానికి ట్రంప్ సానుకూలంగా స్పందించారు. దీనికి బదులుగా ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా తెరిచేందుకు అంగీకరించింది.
రెండు వారాల కౌంట్ డౌన్ స్టార్టింగ్
ఈ రెండు వారాల విరామం అనేది ఒక రకమైన కౌంట్‌డౌన్ లాంటిది. ఇస్లామాబాద్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య ఉన్న ప్రధాన విభేదాలపై ఒక అవగాహన రావాల్సి ఉంది. ఈ రెండు వారాల గడువులో ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పది సూత్రాల ప్రతిపాదనను సిద్ధం చేసింది. అవి బాగానే ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఆంక్షల తొలగింపు, భవిష్యత్తులో దాడులు జరగవనే గ్యారెంటీ వంటి అంశాలను ఇరాన్ కోరుతుండగా, అమెరికా మాత్రం ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలను ఆపేయాలనిఅంటోంది. ఈ చర్చలు సఫలమైతే ప్రపంచ చమురు మార్కెట్ కుదుటపడుతుంది,.
రెండు దేశాల మధ్య మైండ్ గేమ్ వార్
ఇది ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఒక భారీ మైండ్ గేమ్. ట్రంప్ తన హెచ్చరికల ద్వారా ఇరాన్‌ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో సఫలమయ్యారు. అటు ఇరాన్ కూడా యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని గ్రహించి, తన ప్రజలను రక్షణ కవచంగా వాడుకుంటూనే దౌత్యపరమైన ముందడుగు వేసింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ రెండు వారాల గడువు వైపు చూస్తోంది. ఈ పక్షం రోజుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరగబోయే ఈ చర్చలు కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా, మొత్తం ప్రపంచ శాంతికి అత్యంత కీలకం కానున్నాయి.
