పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ సాగుతోంది. ఈ సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ ఒకే రోజు దాదాపు 2,500 పాయింట్లు పతనమై ఇన్వెస్టర్లను వణికించింది. శుక్రవారం మరో 1,471 పాయింట్లు కుప్పకూలింది. మొత్తంగా గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 7,000 పాయింట్ల వరకు నష్టపోగా, నిఫ్టీ 23,200 స్థాయికి దిగువకు పడిపోయింది.
ఆవిరైన రూ. 40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద
ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఇన్వెస్టర్ల సంపద మంచులా కరిగిపోయింది. కేవలం ఈ ఒక్క వారంలోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 35 నుండి 40 లక్షల కోట్ల వరకు ఆవిరైందని అంచనా. కేవలం మార్చి 2వ తేదీ నుండి మార్చి 13వ తేదీ మధ్య జరిగిన వివిధ పతనాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించి బయటకు వెళ్లడం మార్కెట్ క్యాప్‌ను భారీగా దెబ్బతీసింది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగవచ్చనే భయంతో రిటైల్ ఇన్వెస్టర్లు సైతం అమ్మకాలకు మొగ్గు చూపారు.
ముడిచమురు సెగ
మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ముడిచమురు ధరలు పెరగడం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. భారత్ తన అవసరాల కోసం 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. దీని ప్రభావంతో పెయింట్స్, టైర్లు, ఏవియేషన్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి.
రూపాయి రికార్డు కనిష్టం
యుద్ధం ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ , ఐటీ , మెటల్ రంగాలు ఈ వారంలో అత్యధికంగా దెబ్బతిన్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి దిగ్గజ బ్యాంకుల షేర్లు భారీగా పతనమయ్యాయి. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో భారత రూపాయి విలువ రికార్డు కనిష్ట స్థాయికి రూ. 92 మార్కు దాటి పడిపోవడం దేశీయ మార్కెట్లకు శరాఘాతంగా మారింది. యుద్ధం ఆగిపోతుందన్న సంకేతాలు వచ్చే వరకూ ఈ పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
