బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఓటర్ల జాబితాపై గందరగోళం ప్రారంభమయింది . ఎప్పుడూ అనుసరించే సంప్రదాయాన్ని కాకుండా ఎన్నికల సంఘం కొత్త తరహాలో ఓటర్ల జాబితాలను ప్రకటిస్తోంది. ఇదంతా కుట్ర పూరితమని.. బీజేపీ కూటమికి ఓటు వేయని వారి ఓట్లు తొలగించి.. . దొంగ ఓట్లు చేర్చడానికి అనుసరిస్తున్న విధానమని అక్కడి రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
ఓట్ల జాబితా పద్దతి మార్చిన ఈసీ
జాబితాలో ఓటర్ల సవరణ, నమోదు, ముసాయిదా జాబితాను విడుదల చేయడం, కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల జాబితాలను రాజకీయ పార్టీలకు ఇవ్వడం ఇప్పటి వరకూ ఉన్న పద్దతి. వీటి వివరాలను చూసి అభ్యంతరాలుంటే తెలియజేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కానీ బీహార్లో ఎన్నికల సంఘం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ పేరుతో ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో, ఏయే ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. పూర్తి జాబితా ఇస్తున్నారు.
అక్రమాల కోసమేనని కాంగ్రెస్, ఆర్జేడీతో ఆరోపణలు
లక్షల మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో పాత జాబితాతో కొత్త జాబితాను పోల్చుకుని ఓటర్ల జాబితాలో ఎవరి పేరు మిస్ అయిందో.. తెలుసుకోవడం కష్టమని కాంగ్రెస్, ఆర్జేడీతో అంటున్నాయి. అక్రమాలకు ఆస్కారం కల్పించడానికే వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నాయి. అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించి..దొంగ ఓట్లను చేర్చుకున్నారని ఈ విషయం బయట పడకుండా కొత్త విధానం తెచ్చారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈసీ మాత్ర సాంకేతిక కారణాల వల్ల, ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేశామని చెబుతున్నారు. పాత జాబితాలను, మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్లైన్లో సౌకర్యం ఉందని, బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని సలహాలిస్తున్నారు.
సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం
బీహార్లో వ్యవస్థలు ఎప్పుడూ బలహీనంగానే ఉన్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో అధికారులు ప్రభుత్వానికే అనుకూలంగా పని చేస్తారు. ఓటర్ల జాబితాల్లో పారదర్శకత ఉండాలని.. ఇది కేవలం ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించినది కాదని.. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకానికి సంబంధించినదని బీహార్ విపక్షాలంటున్నాయి. ఓటర్ల జాబితాపై ప్రజల్లో సందేహాలు తెలత్తితే ప్రజాస్వామ్య వ్యవస్థపైనే వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది.