చిన్న అపార్టుమెంట్లలో నివాసం ఉండేవారికి నీటి సమస్య ఎలాంటిదో తెలుసు. ఒక్కో అపార్టుమెంట్ ఫ్లాట్ కు మెయిన్టనెన్స్ కాకుండానే ఒక్క నీటి కోసమే రెండు వేల వరకూ బిల్లులు చెల్లించేవారు ఉన్నారు. అలాంటిది హై రైస్ అపార్టుమెంట్లకు నీరు ఎలా సమకూరుతుంది.. ఎలా అవసరాలు తీరుతాయి.. ఎప్పుడైనా నీటి సమస్య ఏర్పడితే సమస్య ఏమిటనేది చాలా మందిని ఆలోచింపచేసే విషయం.
ఇళ్లకు..అపార్టుమెంట్లకే కాదు.. ఆకాశహర్మ్యాలకూ నీటిని సరఫరా చేయాల్సింది మెట్రో వాటర్ బోర్డే. కృష్ణా, గోదావరి నదులతో పాటు మంజీరా , సింగూర్, హిమాయత్‌సాగర్, ఒస్మాన్సాగర్ వంటి జలాశయాల నుండి నీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తుంది. తీసుకునే కనెక్షన్ ను బట్టి నీరు సరఫరా చేస్తుంది. వెయ్యి ఇళ్లు ఉన్న అపార్టుమెంట్ కాంప్లెక్స్ కు వారి అవసరాలకు తగ్గ కనెక్షన్ తీసుకోవచ్చు. కానీ అవి సరిపోతాయా లేదా అన్నది చెప్పడం కష్టం. అదే సమయంలో నీరు రోజూ ఇవ్వరు. ఇప్పటికైతే రోజుమార్చి రోజు ఇస్తున్నారు. కొరత ఉంటే అది కూడా ఉండదు.
ఇటీవల చాలా అపార్టుమెంట్లలో బోర్ వెల్స్ ఉంటాయి. నీటి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా హై రైజ్ అపార్ట్మెంట్లు బోర్వెల్ల ద్వారా భూగర్భ జలాలను ఉపయోగిస్తాయి. హైదరాబాద్‌లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతున్నందున, కొన్ని అపార్ట్మెంట్లలో బోర్ వెల్స్ పని చేయడం లేదు. వేసవి కాలంలో ట్యాంకర్ల మీద ఆధారపడ్డారు. హై రైజ్ అపార్ట్మెంట్ల కోసం ప్రత్యేక పైప్లైన్లను వేయదు. కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు నిర్మాణ సమయంలో మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థకు కనెక్ట్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి.
హైదరాబాద్‌లోని చాలా హై రైజ్ అపార్ట్మెంట్లు నీటి కొరతను ఎదుర్కోవడానికి వాటర్ రీసైక్లింగ్, రీయూస్ సిస్టమ్స్‌ను అమలు చేస్తున్నాయి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) ద్వారా వ్యర్థ జలాన్ని శుద్ధి చేసి, ఫ్లషింగ్, గార్డెనింగ్ లేదా ఇతర నాన్-పోటబుల్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు రెయిన్వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు కూడా కొన్ని అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్ని చేసినా .. నీటిని పొదుపుగా వాడుకోని చోట్ల.. సమస్యలు వస్తున్నాయి. ఒక్క సారి నీటి సమస్య వస్తే.. ఇక ఎంత పెట్టి కొన్నా ఆ ఆపార్టుమెంట్ ఉపయోగంపై సందిగ్ధత ప్రారంభమవుతుంది.