ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, గత ప్రభుత్వ అక్రమాలపై గట్టి చర్యలు తీసుకోవడం లేదని, ఇది జగన్కు ప్రభుత్వం భయపడటమేనని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అంటే.. సోషల్ మీడియాలో కొంత మంది వంత పాడుతున్నారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు, రఘురామ కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్, షిరిడిసాయి, లిక్కర్ స్కాం వంటి సున్నితమైన కేసుల్లో జగన్ పాత్రపై ఉక్కుపాదం మోపాలని ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవాలను పరిశీలిస్తే.. జగనే భయం నీడలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఏపీలో కనిపిస్తూ, మిగిలిన సమయం బెంగళూరు ప్యాలెస్కే పరిమితమవుతున్నారు. గతంలో గర్జించిన వైసీపీ సీనియర్ నేతలు సైతం నేడు బయటకు వచ్చేందుకు సాహసించలేక పోతున్నారు.
ప్రతిపక్ష నేతపై గుడ్డిగా చర్యలు తీసుకుంటారా?
రాజకీయం అంటే గుడ్డిగా ప్రత్యర్థులపై దాడులు చేయడం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినట్లుగా అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం వంటి రాజ్యాంగ విరుద్ధ పనులకు ఆయన తావు ఇవ్వడం లేదు. ఏ చర్య తీసుకున్నా అది చట్టబద్ధంగా, న్యాయస్థానాల్లో నిలబడేలా ఉండాలన్నది ఆయన పద్ధతి. అందుకే అవినీతి ఆరోపణలు ఉన్న చోట సిట్ ల ద్వారా లోతైన విచారణ చేయిస్తూ, పక్కా ఆధారాలతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగే ఆలస్యాన్ని కొందరు భయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ, అది చంద్రబాబు అనుసరిస్తున్న చట్టబద్ధమైన ప్రక్రియ అనుకోవచ్చు.
ఏబీవీకి చట్టం ప్రాసెస్ తెలియదా?
ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు చట్టపరమైన విచారణలు ఎంత సమయం తీసుకుంటాయో పూర్తిగా తెలుసు. నేర నిరూపణ జరగకుండా తీసుకునే నిర్ణయాలు చివరకు నిందితులకు న్యాయస్థానాల్లో సానుకూలంగా మారే ప్రమాదం ఉందని ఆయనకు తెలియనిది కాదు. అయినప్పటికీ, ఆయన వంటి వారు కూడా అసహనం వ్యక్తం చేయడం వెనుక గతంలో వారు అనుభవించిన వేధింపుల తాలూకూ ఆవేదన ఉండవచ్చు. కానీ, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం భావోద్వేగాల మీద కాకుండా, సాక్ష్యాధారాల ఆధారంగానే అడుగులు వేయాల్సి ఉంటుంది. జగన్ హయాంలో వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలుసు, ఇప్పుడు వాటిని మళ్లీ గాడిలో పెట్టి న్యాయం చేయడం అంత తేలికైన విషయం కాదు.
జగన్కు రాజకీయంగా మేలు చేయకూడదన్నదే మొదటి పాలసీ
జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందన్న వాదనలో పస లేదని, పద్ధతిగా ఉచ్చు బిగించడం చంద్రబాబు శైలి అని టీడీపీ వర్గాలు నమ్ముతున్నాయి. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరనే భరోసాను ప్రజల్లో కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా కసరత్తు చేస్తోంది. సాక్ష్యాధారాలను సేకరించడం, అధికారుల పాత్రను నిర్ధారించడం వంటి ప్రక్రియలు నిశ్శబ్దంగా జరుగుతున్నాయి. గత పాలకులు చేసిన తప్పులు ఈ ప్రభుత్వానికి పొలిటికల్ ట్రాప్ కాకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. విచారణలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది బాధితులుగా ఉన్న వారిని నిందితులుగా చిత్రీకరించే అవకాశం ఇస్తుందని ఆయన అప్రమత్తంగా ఉన్నారు. అందుకే వివేకా కేసులో కానీ, రఘురామ కేసులో కానీ సీబీఐ , ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు వేసే ప్రతి అడుగులోనూ క్లారిటీ ఉంది. ఈ ఆలస్యం ప్రత్యర్థికి ఇచ్చే ఉపశమనం కాదు, అది ఒక పటిష్టమైన చట్టపరమైన దాడికి ముందు ఉండే నిశ్శబ్దం మాత్రమేనని అనుకోవచ్చు.
