శుక్రవారం భైరవం సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కుతోంది. బీ,సీ సెంటర్లలో వసూళ్లు బాగున్నాయి. ఇందులో ముగ్గురు హీరోలు. అయితే మనోజ్‌కు ఇది స్పెషల్ సినిమా. దాదాపు 10 ఏళ్ల తరవాత తన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలైంది. నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్రని మనోజ్ బాగానే చేశాడు. మాడ్యులేషన్ లో తండ్రి మోహన్ బాబుని గుర్తు చేసినా, మార్కులు పడ్డాయి. అయితే అక్కడక్కడ కొన్నిచోట్ల ఓవర్ ది బోర్డ్ చేశాడు. ఇది కాస్త తగ్గించుకొంటే మనోజ్‌కు విలన్ గా మంచి భవిష్యత్త్ ఉంది. త్వరలో రాబోతున్న ‘మిరాయ్’లోనూ మనోజ్ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. ఆ సినిమాపై కూడా మనోజ్ గట్టి నమ్మకాలు పెట్టుకొన్నాడు.
తెలుగులో యంగ్ విలన్ల లోటు చాలా ఉంది. యంగ్ హీరోల సినిమాల్లో ధీటైన ప్రతినాయకులు కరువైపోతున్నారు. ఇలాంటి దశలో మనోజ్ విలన్ గా ఎంట్రీ తీసుకోవడం మంచి ఆలోచన. మనోజ్ ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ విలన్ పాత్రలకు సూటవుతాయి కూడా. తాను ఫిజిక్ పై కాస్త దృష్టి పెడితే సరిపోతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా నటించాడు. తన పాత్ర కూడా డీసెంట్ గానే సాగింది. తనకూ ఇది మంచి కమ్ బ్యాక్ అనుకోవొచ్చు. కాకపోతే రోహిత్ కూడా తన ఫిజిక్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. త్వరలో ‘సుందరకాండ’ అనే ఓ సినిమా రాబోతోంది. అదో రొమాంటిక్ కామెడీ సినిమా. ఆ సినిమాపై రోహిత్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. హీరోగా తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నాడు. నిజానికి అదే కమ్ బ్యాక్ మూవీ అనుకొన్నారు. కానీ దాని కంటే ముందు ‘ప్రతినిథి 2’, ‘బైరవం’ విడుదలయ్యాయి. మరి ‘సుందర కాండ’ ఎలా ఉంటుందో చూడాలి.