బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తిపై వైసీపీ అధికారిక ప్రకటన చేసింది. బోరగడ్డ అనిల్‌కుమార్‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోంది. వీటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నామని.. అధికారిక ప్రకటన ఆ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
ఎందుకు ఇంత ప్రత్యేకంగా బోరుగడ్డ అనిల్ గురించి వైసీపీ చెబుతోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి. బోరుగడ్డ అనిల్ చాలా కాలం జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి తనను జగనే బయటకు తీసుకు వచ్చారని క్రెడిట్ ఇస్తున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇప్పించడానికి జగన్ ఏ లాయర్లను ఉపయోగించారో తన కేసులోనూ ఆ లాయర్లనే ఉపయోగించి బెయిల్ వచ్చేలా చేశారన్నారు. తమ పార్టీకి చెందిన నేతను బయటకు తేవడానికి జగన్ ఇంతగా ప్రయత్నించారా అని ఆశ్చర్యపోయేలా ఆయన చెబుతూంటే.. వైసీపీ ఫ్యాన్స్ సంబర పడాల్సిందిపోయి.. ఆయన మా పార్టీ కాదు అని ప్రకటిస్తున్నారు.
బోరుగడ్డ అనిల్ ను మొదటి నుంచి ఎంకరేజ్ చేసింది వైసీపీ. ఆయనతో ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడించింది వైసీపీ. అయితే ఆయనను ఇప్పుడు తమ పార్టీ కాదని అంటోంది. జగన్ జోలికొస్తే చంపేస్తామని బెదిరించడమే కాదు.. పవన్ కల్యాణ్, చంద్రబాబు కుటుంబాలపైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. అలా మాట్లాడేందుకు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చేదని ఆయన పోలీసులకు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర అరాచకాలూ చేశారు. అయితే ఇలాంటివి చాలా మంది చేశారు. అయినా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ను మాత్రమే తమ పార్టీ కాదని వైసీపీ చెప్పుకుంటోంది.
బోరుగడ్డ అనిల్ చేసిన డ్యామేజీ కంటే..ఇతర నేతలు చేసిన చేసిన డ్యామేజీ వైసీపీకి ఎక్కువ. అయినా బోరుగడ్డను మాత్రమే ఎందుకు వైసీపీ డిస్వోన్ చేసుకుంటుందన్నది మాత్రం.. చాలా మందికి అర్థం కాని విషయం. అవసరం లేదనుకుంటే.. రేపు ఎవరికైనా వైసీపీ ఇదే గతి పట్టిస్తుందనడంలో సందేహం లేదు.
