ప్రతిపక్ష పాత్రను తాము సమర్థంగా పోషించడం లేదని.. ప్రభుత్వంపై పోరాడటం లేదని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎందుకు పోరాడలేకపోతున్నారో ఆయన చెప్పలేదు కానీ.. నిజం అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేత అయినా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. కేటీఆర్ కు రాజకీయ నాయకత్వం అంటే.. తిట్టడం, తిట్టించుకోవడం అన్నంత వరకే తెలుసు. హరీష్ రావు చేతులు ఎప్పుడో కట్టేశారు. కవితను గెంటేశారు. ఇక ఎక్కడ పోరాడతారు ?. ప్రజాసమస్యలు ఎప్పుడు గుర్తుకు వస్తాయి?
తెలంగాణలో లెక్కలేనన్ని ప్రజా సమస్యలు
తెలంగాణలో పాలన సజావుగా సాగుతుందా లేదా అన్నది కాస్త తీరిగ్గా చూస్తే.. ఎన్నో లోపాలు కనిపిస్తాయి. రేవంత్ కేవలం రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశాలకే సమయం కేటాయిస్తున్నారు. సాధారణ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. యూరియా సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. కేంద్రంపై నిందలేసి లైట్ తీసుకుంటున్నారు. అత్యంత తీవ్రమైన వరదలు వస్తే పట్టించుకున్నది పెద్దగా ఏమీ లేదు. ఇతర సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు. అమలు చేయాల్సిన హామీలూ చాలా ఉన్నాయి. కానీ చర్చకే రావడం లేదు.
అంతర్గత సమస్యలతో బీఆర్ఎస్ సతమతం
ప్రభుత్వంపై పోరాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ తమలో తాము పోట్లాడుకోవడానికి సమయం కేటాయిస్తోంది. కుటుంబ వ్యవహారాలను కూడా కేసీఆర్ చక్కదిద్దలేకపోవడంతో కుటుంబం చీలిపోయింది. ఇప్పటికీ కేసీఆర్ రోజూ పార్టీ నేతలతో సమావేశాలు అని.. ఫామ్ హౌస్ లోనే కాలం గడుపుతున్నారు. రోజుల తరబడి చర్చిస్తున్నట్లుగా మీడియాకు లీకులు ఇస్తారు కానీ .. చక్కదిద్దుకునేందుకు చేసే ప్రయత్నాలు మాత్రం ఏమీ ఉండటం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలే పెద్ద సమస్య అన్నట్లుగా మారిపోయింది.
రేవంత్ ను ప్రశ్నించేది తమ పార్టీ విషయంలోనా ?
కవిత వెనుక రేవంత్ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు…. కాదు హరీష్ వెనుక రేవంత్ ఉన్నాడని కవిత ఆరోపణలు చేయడం కామన్ గా మారిపోయింది. రేవంత్ ఈ విషయంలో వారు సిగ్గుపడేలా కౌంటర్ ఇచ్చారు. మీరంతా చెత్త..మీ వెనుక ఎందుకు ఉంటానని..తనను నమ్ముకున్న వాళ్ల ముందు ఉంటానన్నారు. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలకు సీఎంను కారణం చేయాలనుకుంటే.. రాజకీయం మొత్తం మారిపోతుంది. ఇపుడు అదే జరిగింది. ప్రజా సమస్యలు పక్కకుపోయాయి. రేవంత్ రెడ్డి కూడా రాజకీయ ఆరోపణలతో లాక్కొచ్చేస్తున్నారు.