రాజకీయాల్లో అద్భుతమైన వ్యూహకర్త, అంతకుమించిన అడ్మినిస్ట్రేటర్ ఇవి అప్పట్లోనే కాదు, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న బిరుదుల్లాంటి ముద్దు పేర్లు! తర్వాత ఏమైందో ఏమిటో ఈ అంశాల్లో ఆయనపై పెట్టుకున్న అంచనాలకు చంద్రబాబు చేరుకోలేకపోతున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అనవసరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని, అననుకూల సమయాల్లో వ్యూహాత్మక తప్పిదాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ నాయకులు, సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి కూడా బలమైన కారణాలు లేకపోలేదు. గతంలో బాబు పాలనను, రాజకీయాల పరంగా, పరిపాలనా పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను చూసి, అభినందించినవారిలో చాలా మంది నేడు పార్టీలకతీతంగా బాబు మాటలపైనా, వ్యూహాత్మక నిర్ణయాలపైనా పెదవి విరుస్తున్నాయి. వాటిలో తాజాగా వచ్చి చేరింది వైకాపాకు సంబందించిన 12మంది సభ్యులకు నోటీసులు అనే వార్త!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న విషయాలపై ఎవరు ఎలా మీడియాలో చూపించినా, పత్రికల్లో ప్రచురించినా వాస్తవాలైతే “లైవ్”లోనే ప్రజలకు చేరిపోతున్నాయి. ఇక అనంతర విశ్లేషణలంటారా… అవి వారి వారి ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆసక్తుల మేరకు విడుదలవుతున్నాయి! వాటిపై ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందనే అనుకోవాలి. ఇదే సమయంలో తాజాగా వైకాపా సభ్యులకు నోటీసులు ఇవ్వడం అనే చర్య చంద్రబాబు చేసిన మరో వ్యూహాత్మక తప్పిందం అనే అనుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో అల్లరిచేశారని రోజా ను ఇప్పటికే ఏడాది పాటు సస్పెండ్ చేసిన టీడీపీ… అప్పట్లో “అసెంబ్లీలో వైకాపా సభ్యులు” అనే విషయాన్ని బాగానే జనాల్లోకి తీసుకెళ్లింది. అయితే అది గతం… ఇప్పుడు చర్చంతా ప్రత్యేక హోదాపై నడుస్తోంది. ఈ ప్రత్యేక హోదా బీజేపీ ఇచ్చేదీ లేదు, బాబు తెచ్చేదీ లేదని ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిన రోజులివి.
ఈ పరిస్థితుల్లో ఆ లోటు ప్రజలకు కనిపించకుండా, ఆ ఇబ్బందులు ప్రజలపై పడకుండా, వీలైతే ఆ అంశాన్ని ప్రజల ఆలోచనల్లోనుంచి తీసేసాలా బాబు తన పరిపాలనతో మెస్మరైజ్ చేయాలి. లేకపోతే… కనీసం ప్రత్యేక హోదా అనే అశం అయినా మీడియాలో రాకుండా, ప్రతిపక్షాలకు బలమైన అవకాశం ఇవ్వకుండా తనదైన మార్కు పాలనతో ముందుకెళ్తూ జాగ్రత్త పడాలి. అయితే తాజాగా వైకాపా సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో… ఆ అంశంతో బాబు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం.. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకే అసెంబ్లీలో పోరాటం చేశాం.. యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పోరాటం చేస్తే నోటీసులిచ్చారు.. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుని తినా తిననివ్వదు” అని వైకాపా నేతలు మొదలుపెట్టేశారు. దీంతో వైకాపా నేతలు ప్రత్యేక హోదాపై పోరాడుతుంటే… చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కావాలనే ఇలా అణిచివేస్తోంది, ప్రత్యేక హోదాపై మాట్లాడితే ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయే ప్రమాదం మొదలైపోయింది.
అదేంటి… స్పీకర్ ఇచ్చిన ఫిర్యాదును, సభాహక్కుల సంఘం తీసుకునే నిర్ణయాన్నీ, అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన నోటీసుని బాబుగారికి అంటిస్తే ఎలాగా? అది పూర్తిగా స్పీకర్ కు సంబందించిన విషయం కదా? వైకాపా సభ్యులకు ఇచ్చిన నోటీసులకు, రోజా సస్పెన్షన్ కు చంద్రబాబు కు సంబంధం ఏంటి? అది హౌస్ తీసుకున్న నిర్ణయం, స్పీకర్ ప్రకటించిన నిర్ణయం కదా అని ఎవరైనా అంటుంటే… ఆస్థాయి అమాయకత్వంలోనే ఇంకా ప్రజలు ఉన్నారని భావిస్తున్నారా? అనే ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి మరి!!