మొదటి సారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మరుక్షణం నుంచీ కూడా చంద్రబాబు తాపత్రయం ఒక్కటే. అందరూ తనను సమర్ధుడని కీర్తించాలి, తన సమర్ధతను గుర్తించాలి అని ఆలోచిస్తుంటాడు. ప్రపంచం మొత్తం కూడా తన పేరు ప్రతిష్టల గురించి చర్చించాలనుకుంటాడు. అందుకే మీడియాను మేనేజ్ చేయడం ఎలా అనే విషయంలో మంచి పట్టు సాధించాడు. ఇవి రెండు విషయాలూ కూడా చంద్రబాబు రాజకీయ జీవితానికి పెట్టని కోటలయ్యాయి. రెండో సారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి అవకాశం వచ్చేలా చేశాయి. అయితే మొదటి సారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు సక్సెస్ అయినంత స్థాయిలో ఇప్పుడు మాత్రం అవలేకపోతున్నాడన్నది వాస్తవం.
హుధ్ హుధ్ ధాటికి విశాఖ తీరం అల్లకల్లోలం అయిన తర్వాత మిగతా అన్ని పనులూ పక్కన పెట్టేసిన చంద్రబాబు పూర్తిగా విశాఖకే పరిమితమయ్యారు. విశాఖను వీలైనంత తొందరగా సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేయాలన్న తపనతో అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలూ దగ్గరుండి చూసుకున్నాడు. ‘విశాఖ ప్రజలకు ధైర్యం చెప్పి, వీలైనంత త్వరగా అన్ని సమస్యలనూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించి, ఆ తర్వాత తన పనులు తాను చూసుకుంటూ ఉంటే సరిపోతుందిగా…. అక్కడే ఉండి హడావిడి చేయాలా?’ అని అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ ప్రజలు మాత్రం విమర్శలను పట్టించుకోలేదు. చంద్రబాబునే సమర్ధించారు. చంద్రబాబుకు మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత గోదావరి పుష్కరాల సందర్భంగా మొదటి రోజే… తన సమక్షంలోనే విషాద ఘటన జరగడంతో…ఆ మచ్చను తుడిచేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి పుష్కరాలు అయిపోయేవరకూ అక్కడే మకాం పెట్టేశాడు. ఈ సారి ప్రజలు కూడా మరీ గొప్పగా అనుకున్నది ఏమీ లేదు. ఇప్పుడిక కృష్ణా పుష్కరాలకు చంద్రబాబు చేస్తున్న హడావిడిని మాత్రం ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనులను చేస్తూ, పూర్తి సమయం పుష్కరాలకే కేటాయించడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటున్నానని చంద్రబాబు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యాత్రికులతో ఉంటే యాత్రికుల కష్టాలు పెరిగే అవకాశమే ఎక్కువ. పోలీసులు, అధికారుల అటెన్షన్ మొత్తం కూడా చంద్రబాబుపైనే ఉంటుంది. పుష్కరాల సమయంలో చంద్రబాబు చేస్తున్న ఏ పనులు కూడా ముఖ్యమంత్రి స్థాయి వక్తి చేయాల్సిన పనులు కాదు. నిద్రాహారాలు మాని, 24గంటలూ ప్రజల కోసమే పనిచేస్తున్నానని చంద్రబాబు చెప్తూ ఉంటాడు. అది నిజమే అనుకున్నా… ఆ పనులు ముఖ్యమంత్రి చేయాల్సిన స్థాయి పనులు అయితే ప్రజలకూ మంచి జరుగుతుంది. చంద్రబాబుకూ పేరు వస్తుంది. లేకపోతే విమర్శలే మిగులుతాయి.
‘నేను ఒక్కడినే పనిచేస్తున్నా…మంత్రులూ, అధికారులు ఎవ్వరూ పనిచేయడం లేదు. అందరికంటే నేను ఎక్కువగా పనిచేస్తున్నా…’ అని అనిపించుకోవాలని కూడా చంద్రబాబుకు మహాసరదా. గొప్ప అడ్మినిస్ట్రేటర్‌కు ఉండాల్సిన క్వాలిటీ అయితే ఇది కాదు. ఈ విషయం చెప్పుకోవడానికి క్రికెట్లో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. సౌరవ్ గంగూలి కంటే సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప బ్యాట్స్‌మేన్. కానీ కెప్టెన్‌గా మాత్రం సచిన్ ఫెయిల్ అయ్యాడు. సౌరవ్ సక్సెస్ అయ్యాడు. గంగూలి సక్సెస్ మొత్తం కూడా అతని బ్యాటింగ్ టాలెంట్ కంటే కూడా మంచి టీంని తయారు చేసుకోవడం, ఆ టీంని నమ్మడంలోనే ఉంది. ఆందుకే సూపర్ ప్లేయర్ కానప్పటికీ టీం ఇండియాకు ఒన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అయ్యాడు గంగూలి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అవి. డిప్యూటీ కలెక్టర్, అంతకంటే తక్కువ స్థాయి అధికారులు చేయాల్సిన పనులు కూడా చంద్రబాబు చేస్తున్నాడంటే చంద్రబాబు మంచి ప్లేయర్ అన్న పేరు వస్తుందేమో కానీ సమర్ధనాయకుడు అయితే కాలేడు.
రెండేళ్ళ చంద్రబాబు పరిపాలన, ఆయన చర్యలను గమనిస్తుంటే ఇంకో డౌట్ కూడా వస్తూ ఉంటుంది. భారీ విజయాలు సాధిస్తాం అనే నమ్మకం ఉన్నప్పుడు చిన్న చిన్న విజయాలను మన ఖాతాలో వేసుకోవాలన్న తాపత్రయం మనకు ఉండదు. అలాగే పని చేస్తున్నట్టు కనిపించాలని కూడా అనుకోం. రానున్న ఆ భారీ సక్సెస్సే అన్నింటికీ సమాధానం చెప్తుంది అన్న విశ్వాసంతో పనిచేసుకుపోతాం. రెండోసారి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి చంద్రబాబులో ఇలాంటి నమ్మకం ఎప్పుడూ కనిపించలేదు. దానికి తగ్గట్టుగానే ఆయనే ఇచ్చిన హామీలు, కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, ప్యాకేజ్, రైల్వే జోన్ లాంటివేవీ సీమాంధ్ర ప్రజలను సంతృప్త పరిచే స్థాయిలో జరగడం లేదు. రాజధాని అంశం కూడా మూడడుగులు ముందుకు…రెండడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. ఈ రెండేళ్ళ పాలనా కాలం చూస్తే మాత్రం చంద్రబాబు సమర్ధుడే అని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం.
ఈ పుష్కరాల పూజారి పనులను పక్కన పెట్టి తన స్థాయికి తగ్గ పనులను చేయడం పైన చంద్రబాబు దృష్టిపెడితే రాష్ట్రంతో పాటు ఆయనకు కూడా… ‘మంచిది’.