చెన్నైని ముంచిన ఎల్ నినో ?!

చెన్నై మహానగరం ఎందుకు మునిగిపోయింది? ఇందులో పెనువాతావరణ మార్పు (ఎల్ నినో) ప్రభావం ఎంత? 1976లో 45 సెంటీమీటర్లకు పైగా వర్షం పడినా చెక్కుచెదరని నగరం ఇప్పుడు ఎందుకిలా తయారైంది? వరదనీరు చెన్నై నగరంలోని నాలుగు నదుల్లోకి ఎందుకుపోవడంలేదు? వరదనీరు బంగాళాఖాతంలోకి వెళ్ళే మార్గం ఎందుకని మూసుకుపోయింది? చెన్నై వరదకు అసలు కారణాలు తెలుసుకుందాం…

పెనువాతావరణ మార్పు

అనావృష్టికి కారణమైన ఎల్ నినో (El Nino) కీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో తలెత్తిన వరదలకి ఏదైనా సంబంధం ఉన్నదా? ఈ దిశగా కూడా వాతావరణ నిపుణులు ఆలోచిస్తున్నారు. మామూలుగా నైరుతీ రుతుపవనాల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపే ఎల్ నినో ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలపై కూడా ప్రభావం చూపుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో తీవ్రమైనప్పుడు ఈక్వడార్, పెరూ, అమెరికాలోని నైరుతీ భాగంలో అత్యధిక వానలు పడటమే ఈ అనుమానాలకు కారణం. అయితే చలికాలంలో కురిసే వానలపై ఎల్ నినో ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది ఇప్పటికి సందేహమే..

1997 తర్వాత ఎల్ నినో సంవత్సరంగా చెప్పుకుంటున్న ఈ ఏడాదిలో నైరుతీ రుతుపవనాలరాకను ఆలస్యం చేసిన ఎల్ నినో, ఇప్పుడు వింటర్ మాన్ సూన్ మీద రివర్స్ ప్రభావం చూపుతుందన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎల్ నినో శీతాకాలంలో వచ్చే వానలపై పెద్దగా ప్రభావం చూపవనే అనుకోవచ్చు, కాకపోతే ఈశాన్య రుతుపవనాల ముందువెనకల్లో అల్పపీడనాలు ఏర్పాడటం, అవి తుపాన్లుగా మారడంపై ఎల్ నినో ప్రభావం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. 2015 ఎల్ నినో ప్రభావిత సంవత్సరంగా వాతావరణ శాస్త్రవేత్తలు నిర్ధారించిన సమయంలో ఇలా సరికొత్త రీతిలో దీని ప్రభావం కనిపించడం విడ్డూరమే. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 8 రాష్ట్రాల్లో కరువుకాటకాలు తలెత్తాయి. ఇప్పుడు ఎల్ నినో వింత ప్రభావం (అల్పపీడనం సృష్టించడం వంటివి) కారణంగా ఆంధ్ర, తమిళనాడుల్లో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు పడుతున్నాయని అంటున్నారు.

నదుల నోళ్లు నొక్కేశారు

తమిళనాడు రాజధాని చెన్నైలో గతనెల (నవంబర్) 16న 23.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇది 2009లో అదే రోజున (నవంబర్ 16న) కురిసిన అత్యధిక వర్షపాతం (15 సెంటీమీటర్ల)కంటే ఎక్కువ. చెన్నైలో సాధారణంగా నవంబర్ నెలలోనే వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. అయితే సాధారణ వర్షపాతంకంటే, ఈ ఏడాది ఇప్పటికే 80శాతం అదనంగా వానలు పడ్డాయి. చెన్నైలో నాలుగు నదులున్నాయి. కూమ్ (Cooum), అడయార్, అరణియార్, కొర్తలియార్ (Kortaliyar). ఈ నదులు పశ్చిమదిశ నుంచి తూర్పుదిశగా ప్రవహిస్తుంటాయి. మాములుగా అయితే ఇవి నదుల్లా కనపడవు. వర్షపు నీరు నదుల్లోకి రాకుండా అనేక కట్టడాలు, చెత్తాచెదారం అడ్డుతగులుతుంటాయి. పైగా ఈ నదుల్లోకి రావాలసిన నీరు చెన్నైకి చుట్టూ ఉన్న నాలుగు జలాశయాల్లోకి చేరుతుంటుంది. ఈ నదులు సముద్రంలో కలిసే చోట్ల ఎత్తైన ఇసుకమేటలు అడ్డుతగులుతుండటంతో వరదనీరు సముద్రంలో కలిసే వీలులేకుండా పోయింది. నదుల నోళ్లు నొక్కేయడంతో అవి వరదనీటిని సముద్రంలో కలపలేకపోతున్నాయి.

ఐటీ కారిడార్ తెచ్చిన తంట…

గడచిన కొన్ని దశాబ్దాలుగా చెన్నైనగరం బాగా విస్తరించి మహానగరంగా మారిపోయింది. చుట్టుపక్కల మున్సిపాలిటీలు, పంచాయతీలు నగరంలో విలీనమయ్యాయి. ప్రస్తుతం చెన్నై జనాభా కోటి దాటింది. ప్రస్తుతం వచ్చిన వరదల్లో చెన్నై వాసులంతా చిక్కుకుపోయారు. నగరంలో మొదటి ఐటీ హబ్ – `టైడెల్ పార్క్’ ఏర్పడినప్పటి నుంచి నగర రూపురేఖలు మారిపోయాయి. 2000 జులైలో ఈ ఐటీ పార్క్ ప్రారంభించారు. దీంతో దాని చుట్టపక్కల ఐటీ సెక్టార్ బాగా పెరిగింది.

చారిత్రాత్మక పట్టణం మహాబలిపురాన్ని కలిపే ఓల్డ్ మహాబలిపురం రోడ్డు ఇప్పుడు ఐటీ కారిడార్ గా మారిపోయింది. అతిపెద్ద రహదారులు వేశారు.దానికి ఇరువైపులా బహుళ అంతస్థుల భవనసముదాయాలు అనేక కంపెనీలకు వేదికలుగా మారిపోయాయి. దీంతో అక్కడ రియలెస్టేట్ బిజినెస్ ఊపెక్కింది. లోతట్టు ప్రాంతాల్లోకూడా జనావాసాలు వెలిశాయి. చుట్టుపక్కల ప్రజలకు అవసరమైన షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆస్పత్రులు వచ్చేశాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు ఎక్కువయ్యాయి. ఎక్కడా చిత్తడినేల కనబడటంలేదు.
ఈ తరహా అభివృద్ధి జరగకముందు ఆ ప్రాంతమంతా చిత్తడినేల. వరదనీరు భూమిలోపలి పొరల్లోకి చేరుతుండేది. అలాంటిది ఈ ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్ గా మారిపోవడంతో వాననీరు భూలోపలి పొరల్లోకి వెళ్ళే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని కాలనీలు వరదనీటిలో మునిగిపోతున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ వరద పెరగడానికి ఇదో కారణంగా మారింది.

1976 నవంబర్ లో 45.2 సెంటీమీటర్ల వర్షం పడినప్పటికీ, చెన్నై ఆ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. కానీ ఇప్పుడు నగర రూపురేఖలు మారిపోవడంతో వరదల తీవ్రత ఎక్కువైంది. బ్రిటీష్ హయాంలో నిర్మించిన బకింగ్ హామ్ కెనాల్ నిర్వహణను పట్టించుకోక పోవడం వరదనీరు నగరంమీద పడుతోంది. వరదనీరు నదుల ద్వారా సముద్రంలో కలిసే మార్గం లేకుండాపోయింది. నదుల్లో టన్నులకొద్దీ చెత్తాచెదారాలు పేరుకోపోయాయి. నదులను క్లీన్ చేసే చర్యలు కంటినీటి తుడుపుగానే మిగిలిపోయాయి. నగరం పెరిగినంతగా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే స్థితిని కల్పించడంలో పాలకులు విఫలమయ్యారు. తీరప్రాంతాల్లో ఉండే నగరాలు, పట్టణాలు- తుపాన్లు, వరదల తాకిడికి తట్టుకునేలా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. పారిశ్రామికీకరణ, ఆధునీకరణ వంటి పేర్లతో శివారు ప్రాంతాల్లో సెజ్ ల కోసం భూములు పంజారం చేస్తే, దాని చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పడితే చివరకు ఎలాంటి విపత్తులు వస్తాయో చెప్పడానికి నేటి చెన్నై నిలువెత్తు నిదర్శనం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com