కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొన్ని రోజుల క్రితం వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు తీవ్ర అస్వస్థత చెందారు. అప్పుడు ఆమెని ప్రత్యేక విమానంలో డిల్లీకి తీసుకువచ్చి గంగారాం ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల క్రితమే ఆమె కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ బుదవారం సాయంత్రం ఆమె మళ్ళీ అస్వస్థతకి గురవడంతో అదే ఆసుపత్రిలో చేరారు. వారణాసిలో ఎన్నికల ప్రచార సమయంలో ఆమె స్పృహతప్పి తన వాహనంలోనే పడిపోయినప్పుడు మోచేతికి గాయం అయ్యింది. అదే మళ్ళీ ఇబ్బందికరంగా మారడంతో ఆమె ఈరోజు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలకి ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈసారి ఎలాగయినా సరే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలగా ప్రయత్నిస్తోంది. అందుకే ఆమెకి కొంచెం అస్వస్థతగా ఉన్నప్పటికీ వారణాసిలో ప్రచారానికి బయలుదేరారు. కానీ అప్పటి నుంచి ఆమె ఇంకా అనారోగ్యం పాలయ్యారు.
రెండేళ్ళ క్రితం సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడే, పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగిద్దామనుకొన్నారు. కానీ పార్టీలో కొందరు సీనియర్లు ఆయన నాయకత్వ లక్షణాలని ప్రశ్నించడంతో ఆమె వెనక్కి తగ్గారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆమె స్థానంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఇంతవరకు అటువంటి ప్రయత్నమేదీ చేయలేదు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా భావిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితిలో సోనియా గాంధీపై ఆ భారం మోపకూడదని పార్టీ భావించినట్లయితే త్వరలోనే పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించే అవకాశం కనబడుతోంది. కానీ ఒకవేళ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ పట్ల పార్టీలో వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులలో పడవచ్చు. ఏవిధంగా అంటే, ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడానికి కూడా అర్హుడు కాడని సరిగ్గా ఎన్నికలకి ముందు ఆ పార్టీయే స్వయంగా చాటుకొన్నట్లు అవుతుంది. దానితో ఆ పార్టీకి నాయకత్వ లోపం ఉందని, రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలే విశ్వసించనప్పుడు ఆయన మాటలని, అటువంటి పార్టీని ప్రజలు ఎందుకు విశ్వసించాలని కాంగ్రెస్ ప్రత్యర్ధులు నిలదీస్తే దానికి కాంగ్రెస్ పార్టీ వద్ద జవాబు దొరకదు.