జగన్ టీడీపీ కోవర్టా..?. ఈ అనుమానం గురువారం జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్ చూసిన వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఆయన టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారో.. వైసీపీని, ఆ పార్టీ నేతల్ని ట్రోల్ చేస్తున్నారో చాలా మందికి అర్థం అయి ఉండదు. ప్రెస్మీట్ అసాంతం అలా సాగింది. ఎంత చిన్న స్థాయి నాయకుడు అయినా ఇంత సిల్లీగా ప్రతీ దాన్ని సమర్థించుకోరు. అంతగా సమర్థించుకునే పరిస్థితి లేకపోతే టాపిక్ ను స్కిప్ చేస్తారు. కానీ జగన్ మాత్రం.. అందరూ నవ్వుకునేలా మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ పోతే ఇక టీడీపీకి తిరుగుండదని జగన్ పార్టీ ఫ్యాన్స్ కూడా నిరాశపడేంతగా ఈ ప్రెస్మీట్ సాగిందంటే అతిశయోక్తి కాదు.
స్ట్రాటజిక్గా ప్రభుత్వంపై ఒక్క నిర్మాణాత్మక విమర్శ చేయగలిగారా?
అధికారంలో ఉన్న ప్రభుత్వంపై నిర్మాణాత్మకంగా ఒక్క విమర్శ చేసినా అది రాజకీయంగా ప్రతిపక్ష పార్టీకి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల్లో పలుకుబడి పెంచుతుంది. కానీ జగన్ రెడ్డి ఈ ప్రెస్మీట్లో అన్ని అంశాలు మాట్లాడు. అన్నీ జనరలైజ్ చేసేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చాలా అంశాలు ఉన్నాయి. రోజూ సాక్షి పత్రికలో ఎన్నెన్నో రాస్తూంటారు. రైతుల గురించే ఆయన మరింత నిర్మాణాత్మకంగా విమర్శలు చేయవచ్చు. కానీ అసలు అంతా ఒకే గాటన కట్టి ..తాను పండగ చేశానని..ఇప్పుడు దండగ చేశారని డైలాగులు చెప్పారు. ఒక్క రైతు అయినా జగన్ తమ కోసం మాట్లాడారని అనుకుంటారా?. అన్ని అంశాలు అంతే.. ఆ విమర్శల వల్ల ప్రభుత్వానికి చురుకుదనం పుట్టదు సరి కదా.. ఆయనేం మాట్లాడాడో ఆయనకైనా అర్థమయిందో లేదో పాపం అనుకుని ఉంటారు.
పార్టీ నేతల్ని అలా సమర్థించుకుంటారా?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఏం చేశారో అందరూ చూశారు. ఇంకా ఆయనను అడ్డగోలుగా వెనకేసుకురావడం ఎందుకు?. పిన్నెల్లి బ్రదర్స్ చేసిన హత్యా రాజకీయాలపై సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది. అయినా జగన్ కు మాత్రం ఆయన సుద్ధపూస. వైసీపీలో ఉన్న నేరస్తులందర్నీ ఇలా వెనకేసుకు వచ్చారు. వారు తప్పు చేయలేదని చెప్పడానికి ఓ పద్దతి ఉంటుంది. కానీ చెప్పిన పద్దతిలో చూస్తే.. ఇంత నేరమయ పార్టీకి నాయకుడు అయిన జగన్ అలాగే మాట్లాడుతారని.. ఆయనతో వ్యవహారం ప్రమాదకరమని సామాన్యులు అనుకుంటారు. అధికారులను ఉద్దేశించి వాడు.. వీడు అనడం దగ్గర నుంచి చంద్రబాబు పై అక్కసు వెళ్లగక్కేందుకు చిన్నా..పెద్దా తేడా లేకుండా మాట్లాడటం వరకూ ఆయన అంచనాలను అందుకున్నారు. ఇలా ఉంటే చాలు.. టీడీపీకి ఇక పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదని నిట్టూరుస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు.
ఒక్క అంశంపైనైనా స్పష్టమైన విధానం ఉందా?
మూడు రాజధానుల గురించి అడిగితే.. విషయం డైవర్ట్ అవుతోందని చెప్పి వెళ్లిపోయారు. ఇతర ప్రశ్నలకూ అలాగే డొంకతిరుగుడు సమాధానాలు. అసలు వైసీపీ ఇప్పుడు ఏ అంశంపైనైనా నిజాయితీగా తమ స్ట్రాటజీ ఏమిటో చెప్పగలదా? అమరావతి గురించి చెప్పలేరు.. మూడు రాజధానుల గురించి చెప్పలేరు.. వస్తున్న పెట్టుబడుల గురించి చెప్పలేరు..మొత్తంగా పార్లమెంట్ సమావేశాల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయలేరు. జగన్ రెడ్డి .. కుల రాజకీయాలు చేసుకుంటే చాలు.. చంద్రబాబుపై కోపంతో తనకు ఓట్లు వేస్తారని ఆశపడుతున్నారు. ఆయన తెలివితేటలన్నీ కింద పారబోసుకుంటున్నారు. గుప్పిట తెరిచిన తర్వాత ఆయన ఇంత ఘోరమైన మనిషి అని తెలిసిన తర్వాత ఎవరైనా .. మంచి భవిష్యత్ ఇస్తారని నమ్మి ఓటు వేస్తారా?. చాన్స్ లేదు. అందుకే.. జగన్ ను.. టీడీపీ కోవర్ట్ అని అనుమానించడం ప్రారంభిస్తున్నారు.