మద్యం కేసులో జగన్ ట్రాప్ అంటూ చాలా పెద్ద కథనాన్ని ఆంధ్రజ్యోతి రాసేసింది. ఇటీవల మద్యం కేసులో కొంత మంది బెయిల్స్ ను ఏజీ దమ్మాలపాటి వ్యతిరేకించలేదని .. వైసీపీకి అమ్ముడుబోయారని కొంత మంది టీడీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అదంతా వ్యూహమని చెప్పడానికి ఆంధ్రజ్యోతి ఇన్ని పాట్లు పడింది. ఇంత పెద్ద కథనం రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే..ఆ ట్రాప్ వేసింది జగన్ కాదు.. ఆంధ్రజ్యోతినే.
ఆంధ్రజ్యోతి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి… ప్రభుత్వ పెద్దలు వైసీపీకి ఏదో మేలు చేస్తున్నారన్న కోణంలో కథనాలు రాయడం ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులే ఇప్పుడూ పని చేస్తారని తెలియక కాదు. కానీ అదే పనిగా.. అప్పట్లో కీలకంగా పని చేసిన వారంతా మళ్లీ ఇప్పుడు కీలకమయ్యారని విస్తృతంగా ప్రచారం చేశారు. చివరికి .. ముందూ వెనుకా చూడకుండా.. ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోకపోతే కుమ్మక్కయినట్లేనని ప్రచారం చేశారు. చిన్న చిన్న విషయాను కూడా భూతద్దంలో చూపించారు.
చివరికి లిక్కర్ స్కాములో మొదట్లో అరెస్టులు లేకపోవడంపైనా కథనాలు రాశారు. కొన్ని కేసుల్లో ఎవరికైనా ముందస్తు బెయిల్ వచ్చినా రాకపోయినా .. లాయర్లను నిందించడం ప్రారంభించారు. పెద్దిరెడ్డి కేసుల విషయంలో సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని కూడా ప్రచారం చేశారు. ఇలా మొదటి నుంచి ప్రభుత్వం కొంత మంది వైసీపీ నేతలు, సానుభూతిపరుల విషయంలో సాఫ్ట్ గా ఉందన్న ఓ నమ్మకాన్ని టీడీపీ క్యాడర్ లోకి పంపించారు. దాన్ని అడ్డం పెట్టుకుని అప్రూవర్లుగా మారి అన్ని విషయాలు చెబుతున్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే వాళ్లను అరెస్టు చేయకపోవడానికి ఏజీ వైఫల్యమని ప్రచారం చేయడం ప్రారంభించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు అమల్లోకి రాక ముందే అనుమానాలు వ్యక్తం చేయడం, అవసరమా అని చెప్పడం, ముందూ వెనుకా చూసుకోకుండా వైసీపీ హయంలో పని చేశారని వ్యతిరేకించడం మొదటి నుంచి ఆంధ్రజ్యోతి చేస్తున్న పనే. తాము తప్పొప్పులు చెబుతున్నామని వారు అనుకుంటున్నారు. కానీ పూర్తిగా తెలియకుండా నిందలేసేయడం ఆంద్రజ్యోతిని టీడీపీ క్యాడర్ గుడ్డిగా నమ్మడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. తన కేసుల నుంచి తప్పించుకోవడానికి.. జగన్ రెడ్డి ఎన్ని నాటకాలైనా వేస్తారు. వాటిని ట్రాప్ అనలేం. కానీ అలాంటి రాజకీయాల్లో పడిపోయేలా చేసేలా ఆంధ్రజ్యోతిదే అసలైన ట్రాప్.