ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ద్వేషమో అందరికీ తెలిసిందే. అదేసంగతి నిన్న గవర్నర్ విందులో మరోసారి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు బయటపెట్టుకొన్నారు. చంద్రబాబు నాయుడుకి కాస్త దూరంగా నిలబడి అంటీఅంటనట్లుగా షేక్ హ్యాండ్ ఇచ్చిన జగన్, కెసిఆర్ చేతులని మాత్రం గట్టిగానే పట్టుకొని షేక్ ఇచ్చారు.
ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డికి కెసిఆర్ తో ఏదో ఒక పని లేదా అవసరమే ఉంటుంది తప్ప ఆయనతో ఘర్షణ పడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం ఆయన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేస్తున్నారు కానీ కెసిఆర్ తో పోటీ పడటం లేదు. అలాగే కెసిఆర్ నుంచి ఆయనకి ఎటువంటి పోటీ లేదు. తన శత్రువు చంద్రబాబు నాయుడుని కెసిఆర్ కూడా శత్రువుగానే భావిస్తున్నారు కనుకనే ఆయనతో జగన్ స్నేహం కోరుకొంటున్నారనుకోవలసి ఉంటుంది.
అయితే, కెసిఆర్ కి చంద్రబాబు నాయుడు ఎంత దూరమో జగన్ కూడా అంతే దూరం. తెలంగాణాలో అవసరం పడినప్పుడు తెదేపాని ఎదుర్కోవడానికి వైకాపా పనికివస్తుందనే ఆలోచనతోనో లేదా దాని నుంచి తనకి ఎటువంటి సవాలు ఉండదని గ్రహించినందునే బహుశః కెసిఆర్ వైకాపాని ఉపేక్షిస్తున్నారు తప్ప జగన్ మీద ప్రేమతో కాదు. ముఖ్యమంత్రి కెసిఆర్ కి, తెరాస నేతలకి తమ కుటుంబం పట్ల గౌరవం లేదనే సంగతి బహుశః జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసే ఉంటుంది. మంత్రి కెటిఆర్ తో సహా తెరాస నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అప్పుడప్పుడు చేసే తీవ్ర విమర్శలలో ఆ సంగతి బయటపడుతూనే ఉంటుంది. అయినా కెసిఆర్ తో స్నేహమే కోరుకోవడం చాలా విచిత్రంగానే ఉంది.