కాంగ్రెస్‌పై కేసీఆర్ సాఫ్ట్‌కార్నర్ అంతా హంబక్కే..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… కాంగ్రెస్‌పై.. సానుకూలతతో ఉన్నారని.. కొద్ది రోజులుగా జాతీయ మీడియాలోని ఓ వర్గం విపరీతంగా ప్రచారం చేసింది. తాను పెట్టే ఫెడరల్ ఫ్రంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ మద్దతు తీసుకోవడం కానీ… బీజేపీకి మద్దతు ఇవ్వడం కానీ జరిగే పని కాదని… టీఆర్ఎస్ లోని కొన్ని వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. అంతగా సందర్భం వస్తే కాంగ్రెస్ కే మద్దతివ్వడం లేదా తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ అసలు రియాలిటీ మాత్రం వేరేగా ఉంది. కాంగ్రెస్‌తో కనీసం.. ఓ కర్టెసీ మీటింగ్‌కు హాజరవడానికి కూడా టీఆర్ఎస్ సిద్ధంగా లేదు.

సోనియా మీటింగ్‌కు కేసీఆర్ దూరం…!

మే 23వ తేదీన కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే… బీజేపీ మినహా అన్ని పార్టీల్లో వచ్చిన ఏకాభిప్రాయం ఏమిటంటే… హంగ్ ఖాయం అని. ఆ మేరకు.. కాంగ్రెస్ పార్టీ… బీజేపీయేతర పార్టీలన్నింటినీ.. ఫలితాలు వచ్చిన రోజునే ఏక తాటిపైకి తీసుకు రావాలని నిర్ణయించింది. సోనియా గాంధీ స్వయంగా… రంగంలోకి దిగి… దూరంగా ఉన్న పార్టీలకు ఆహ్వానం పంపుతున్నారు. ఇందులో భాగంగా… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం వెళ్లింది. ఇలా ఆహ్వానం పంపారనే విషయం బయటకు తెలియగానే.. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ ప్రారంభమయింది. కాంగ్రెస్‌ వైపు కేసీఆర్ చూస్తున్నారంటూ… ఓ రకమైన లీకులు.. తెలంగాణ భవన్ నుంచి వస్తున్న సమయంలోనే ఈ ఆహ్వానం అందడంతో.. కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందోనని.. అందరూ ఉత్కంఠకు గురయ్యారు. కానీ.. చివరికి సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ప్రాధాన్యత ఇస్తామన్నది ఉత్తదేనా..?

నిజానికి.. బీజేపీతో జట్టుకట్టే ఉద్దేశమే లేనప్పుడు.. తప్పని సరి అయితే కాంగ్రెస్ వైపే ఉంటామని… జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చినప్పుడు… విపక్ష పార్టీలన్నింటితో… సోనియా ఏర్పాటు చేయదల్చుకున్న సమావేశానికి …టీఆర్ఎస్ హాజరైతే.. పెద్దగా చర్చనీయాంశం అయ్యేది కాదు. అందుకే.. వారి విధానం అదేనన్న ప్రచారం అప్పటికే జరిగింది కాబట్టి. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ తో భేటీకి వెళ్లే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్పడంతో… కేసీఆర్ రాజకీయం… ముందో రకంగా.. వెనుకోరకగా ఉందన్న అభిప్రాయం… వారిలోనే ఏర్పడింది.

కొన్ని పార్టీలను ఆకట్టుకోవడానికే ఆ ప్రచారమా..?

వాస్తవానికి కేసీఆర్.. తన ఫెడరల్ ఫ్రంట్ పర్యటలన్నీ.. బీజేపీ కోసమే చేశారన్న ప్రచారం ఉంది. దానికి తగ్గట్లుగా ఆయన కాంగ్రెస్ మిత్రపక్షాలను మాత్రమే కలిశారు. అయితే.. ఎవరూ .. ఫ్రంట్ పై ఆసక్తి చూపించకపోవడంతో… చివరికి.. తాము ఫ్రంట్ పెట్టినా.. కాంగ్రెస్ వైపే వెళ్తామని.. ఫీలర్స్ పంపించారు. అయితే.. ఇది నిజమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్‌కు వెంటనే వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఓ సమావేశానికి ఆహ్వానం వచ్చింది. కానీ కేసీఆర్ ఉద్దేశం మాత్రం అది కాదు కాబట్టి.. ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఫలితాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే కేసీఆర్ నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com